Guinness Record: గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఇప్పటివరకు చాలా రికార్డులు నమోదయ్యాయి. ఇందులో మనుషులకే కాదు జంతువుల రికార్డులు కూడా ఉన్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ కుక్క ఇందులో చోటు సంపాదించింది. అయితే ఆ కుక్క ఏ విషయంలో ఈ ఫీట్ సాధించిందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ వివరాలను గురించి తెలుసుకుందాం.
అమెరికాలోని ఒరెగాన్‌లో లౌ (కుక్క పేరు) అనే 3 ఏళ్ల కుక్క చెవి పొడవు 13.38 అంగుళాలు ఉంది. దీంతో ప్రపంచంలో అత్యధిక పొడవు కలిగిన చెవులు ఉండటం వల్ల గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అయితే లూ యజమానికి ఈ విషయం చాలా రోజుల క్రితమే తెలుసు కానీ ఎప్పుడు ఆమె లూ చెవులను కొలవడానికి ప్రయత్నం చేయలేదు. ఆమె తరచు లూ పొడవాటి చెవులను గమనించేది. కానీ వాటిని కొలవడానికి సమయం లేకపోవడం వల్ల వాయిదా వేస్తూ ఉండేది.
చివరకు కరోనా మహమ్మారి సమయంలో దానిని కొలవాలని నిర్ణయించుకుంది. లూ చెవులను కొలిచినప్పుడు అది 34 సెంటీమీటర్లు అంటే 13.38 అంగుళాలుగా ఉంది. ఆ తర్వాత ఈ విషయం ఆమె గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులకు తెలిపింది. దీంతో వారు పరిశీలించి లూ పేరును గిన్నీస్ బుక్‌లో నమోదు చేశారు. లౌ నలుపు, లేత రంగు కలిగిన కుక్క. పొడవాటి చెవులు దాని అందాన్ని మరింత పెంచుతున్నాయి. అంతేకాదు ఈ కుక్క అమెరికన్ కెన్నెల్ క్లబ్, ర్యాలీ విధేయతలో టైటిల్స్ కూడా గెలుచుకుంది.