ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని బీఎస్పీ, బీజేడీ పార్టీలు స్వాగతించాయి. కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించాయి. ఇక ఏపీలో అధికార పార్టీ వైసీపీ కూడా కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించింది. కాశ్మీర్ సమస్యకు చక్కని పరిష్కారం సూచించారని రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని అభినందించారు. అమిత్ షా, మోదీకి హ్యాట్సాఫ్ అంటూ పొగడ్తలు కురిపించారు విజయసాయిరెడ్డి.
ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షా చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తమ పార్టీ సమర్థిస్తోందని స్పష్టం చేశారు. జాతీయ జెండాను తగులబెట్టడం జమ్ముకశ్మీర్‌లోనే జరగడం మనం చూస్తున్నామని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 కారణంగా కాశ్మీర్‌కు చెందిన యువతి ఇతర రాష్ట్రాల యువకుడిని వివాహమాడితే ఆమెకు అక్కడ ఉండే హక్కులన్నీ పోతాయని, అదే అక్కడి యువకుడు ఇతర రాష్ట్రాల యువతిని వివాహమాడితే అతడి హక్కులకు భంగం కలుగదని ఆయన చెప్పారు. ఇటువంటి చిత్రమైన పరిస్థితి జమ్ముకశ్మీర్‌లోనే ఉందని ఆయన అన్నారు.