Omicron Variant: గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతం చేస్తోంది. కొత్త కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూ ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ఒక వైపు కరోనా.. మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి మరింతగా పెరిగిపోతోంది. దేశంలో థర్డ్‌వేవ్‌లో ఒమిక్రాన్ బాధితులు క్రమ క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇందులో ఎక్కువ శాతం యువతేనని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సర్వేలో వెల్లడైంది. కరోనా రోగులకు తక్కువ ఆరోగ్య సమస్యలు ఉండటంతో మందుల వాడకం కూడా తగ్గిందని ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా 37 ఆసుపత్రుల నుంచి కరోనా రోగుల డేటాను సేకరించినట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ చెప్పారు. థర్డ్ వేవ్ సమయంలో ఆసుపత్రిలో చేరిన వారి సగటు వయస్సు దాదాపు 44సంవత్సరాలని ఆయన వెల్లడించారు. అంతకు ముందు కోవిడ్ పేషెంట్లు సగటు వయస్సు 55 ఏళ్లని వైద్యులు చెబుతున్నారు.
గత ఏడాది డిసెంబర్ 16 నుంచి ఈ ఏడాది జనవరి 17వ తేదీ మధ్య ఆస్పత్రిలో చేరిన కరోనా రోగుల డేటాను ఐసీఎంఆర్ పరిశీలించింది. ఇందులో యువతీ, యువకులకే ఎక్కువగా ఒమిక్రాన్ సోకిందని గుర్తించారు. ఈ రోగుల్లో గొంతు నొప్పి, జ్వరం, దగ్గు సమస్యలు ఎక్కువగా కనిపించాయని వైద్యులు వివరిస్తున్నారు. థర్డ్ వేవ్ ఒమిక్రాన్ పాజిటివ్ రోగులకు కరోనా లక్షణాలు తక్కువగానే ఉన్నాయని ఐసీఎంఆర్ సర్వేలో తేలిందని వైద్యులు వివరించారు. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ అతి వేగంగా వ్యాపిస్తుందని, ప్రతి ఒక్కరు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్‌లు ధరించాలని, అలాగే భౌతిక దూరం పాటించడం మర్చిపోవద్దంటున్నారు. అలాగే ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవడం ముఖ్యమంటున్నారు.
ఇవి కూడా చదవండి: