AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Lives: ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న ప్రియురాలు

కూతురి మనసును అర్ధంచేసుకోలేకపోయారు. కన్నబిడ్డ ప్రేమను భరించలేకపోయారు. మన కులపోడు కాదని ఆవేశంతో రగిలిపోయారు. దారికాచి దారుణంగా హత్యచేశారు. కానీ కూతురి మనసులోంచి అతని జ్ఞాపకాలను తుడిచిపెట్టలేకపోయారు. మనసిచ్చినవాడి మృతదేహం సాక్షిగా కన్నబిడ్డ నుదుటిపై సింధూరాన్ని చెరపలేకపోయారు. నిష్కళంకమైన ఆ ప్రేమముందు సిగ్గుతో తలదించుకుంది పెద్దరికం.

Love Lives: ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న ప్రియురాలు
Saksham Tate Aanchal
Ram Naramaneni
|

Updated on: Nov 30, 2025 | 7:37 PM

Share

పరువు పేరుతో మరో ఘోరం.. ప్రియుడి మృతదేహంతో వివాహం..  నాందేడ్‌లో గుండెలు పిండేసే దృశ్యం..  మనసుకు నచ్చినవాడిని ప్రేమించింది. పెద్దలను ఒప్పించాలనుకుంది. కానీ ప్రియుడి కులం వేరు కావటంతో పెద్దరికం ససేమిరా అంది. నచ్చినవాడితోనే ఏడడుగులు నడవాలని ఆ యువతి నిర్ణయం తీసుకుంది. దీంతో కుల అహంకారం బుసలుకొట్టింది. తండ్రి, సోదరుల కిరాతకంతో ప్రియుడిని కోల్పోయిన యువతి అనూహ్య నిర్ణయం తీసుకుంది. సక్షమ్‌ అంతక్రియలకు హాజరైన అంచల్‌.. ప్రేమించినవాడి మృతదేహం చూసి కుప్పకూలిపోయింది. అయినా అతనే తన భర్తంటూ మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. నుదుట సింధూరం దిద్దుకుని కన్నీటితో ప్రేమికుడికి నివాళులు అర్పించింది.

మహారాష్ట్రలో జరిగిందీ హృదయవిదారక ఘటన. నాందేడ్‌కు చెందిన 25 ఏళ్ల సక్షమ్ టేట్, హిమేష్ మమిదార్ స్నేహితులు. హిమేష్ సోదరి అంచల్, సక్షమ్‌కు పరిచయం ఏర్పడింది. తర్వాత వారిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. సక్షమ్ దళిత కులానికి చెందినవాడు కావడంతో యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. అంచల్‌తో మాట్లాడొద్దని హెచ్చరించారు. తాము కాదన్నా పెళ్లిచేసుకుంటారనే అనుమానంతో.. సక్షమ్‌పై పగ పెంచుకున్నారు. పక్కాగా ప్లాన్ వేసి.. నవంబర్ 27న జునాగంజ్ ప్రాంతంలో అంచల్‌ తండ్రి, ఆమె సోదరులు సక్షమ్‌ని కిరాతకంగా హత్య చేశారు.

మృతుడి తల్లి ఫిర్యాదు ఆధారంగా యువతి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులతో పాటు ఎనిమిది మందిపై కేసు నమోదైంది. పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులందరినీ అరెస్టు చేశారు. హత్యకు రెండు గంటల ముందు.. యువతి తల్లి సక్షమ్‌ ఇంటికి వెళ్లి అతన్ని బెదిరించింది. కానీ పుట్టింటివారు ఇంత దారుణానికి తెగబడతారని అంచల్‌ ఊహించలేకపోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సక్షమ్‌ హత్యను తట్టుకోలేకపోయింది. తల్లిదండ్రులు, సోదరులు ప్రియుడ్ని భౌతికంగా దూరం చేసినా.. అతడే తన భర్త అంటూ ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకోవడం అక్కడున్న వారి హృదయాలను కదిలించింది.

తన తండ్రి, సోదరులు చేసిన పనికి.. ప్రేమించిన వ్యక్తిని కోల్పోయి అంచల్ శిక్ష అనుభవిస్తోంది. తన ప్రేమను చిదిమేసిన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తోంది. ప్రియుడిని చంపి తన తండ్రి, సోదరులు గెలిచామని భావిస్తున్నారని, బతికున్నా చనిపోయినా సక్షమే తన భర్తంటోంది అంచల్‌. ఇకనుంచి అతని ఇల్లే తన ఇల్లని.. సక్షమ్‌ లేకున్నా అతనింట్లోనే ఉంటానంటోంది. కూతురి ప్రేమను జీర్ణించుకోలేక ప్రియుడిని హతమార్చిన కుటుంబం జైలుకెళ్లింది.

అల్లారుముద్దుగా పెంచినా కన్నబిడ్డ మనసును ఆ కుటుంబం అర్ధంచేసుకోలేకపోయింది. కులాంతర ప్రేమను అంగీకరించలేక పరువుకోసం కిరాతకానికి తెగబడింది. ఇప్పుడా కూతురు అమ్మానాన్న అన్న ఎవరూ లేరంటోంది. ఎవరి మొహం చూడనంటోంది. ఓ ప్రాణం బలిపెట్టాల్సి వచ్చినా చివరికి ప్రేమే గెలిచింది. పెద్దరికం ఓడిపోయింది.