AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి పనులకు వచ్చిన పెయింటర్‌తో ఎఫైర్.. భర్తకు స్పాట్.. ఎలా చిక్కారంటే..?

కర్ణాటకలోని విజయపుర జిల్లాలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను కారుతో తొక్కించి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య అశ్విని సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.

ఇంటి పనులకు వచ్చిన పెయింటర్‌తో ఎఫైర్.. భర్తకు స్పాట్.. ఎలా చిక్కారంటే..?
Ashwini Rajasekhar Anand
Ram Naramaneni
|

Updated on: Oct 22, 2026 | 1:20 PM

Share

కర్ణాటకలోని విజయపుర జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు భార్య కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని ప్రయత్నించినప్పటికీ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి భార్యతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు, ఒక మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయపుర నగర శివార్లలోని చిదంబర ఆలయ రహదారి సమీపంలో అక్టోబర్ 4న 42 ఏళ్ల రాజశేఖర్ బిరాదర్ మృతదేహం లభ్యమైంది. తొలుత గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ప్రమాదంగా పోలీసులు భావించారు. రాజశేఖర్ భార్య అశ్విని బిరాదర్ కూడా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, దర్యాప్తులో బయటపడిన ఆధారాలు కేసుకు కొత్త మలుపు తిప్పాయి.

పోలీసులు ఘటనాస్థలానికి సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, నంబర్ ప్లేట్ లేని నల్లటి స్కార్పియో వాహనం, ఒక ద్విచక్ర వాహనం ఆ ప్రాంతంలో ప్రయాణించినట్లు గుర్తించారు. దీంతో ద్విచక్ర వాహనదారుడిని ప్రశ్నించి మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే రాజశేఖర్ మృతికి వెనుక హత్య కుట్ర ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజశేఖర్, అశ్విని దంపతులకు వివాహమై సుమారు పదేళ్లు అవుతోంది. వీరికి ఆరేళ్ల వయసున్న కవల కుమారులు ఉన్నారు. అయితే, దంపతుల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరిగేవని సమాచారం.

ఇంటి పెయింటింగ్ పనులతో పరిచయం.. ఆ తర్వాత ప్రేమాయణం?

సుమారు ఏడు నెలల క్రితం రాజశేఖర్ విజయపురలోని ఏక్తా నగర్ ప్రాంతంలో కొత్త ఇంటిని నిర్మించాడు. ఆ ఇంటికి పెయింటింగ్ పనుల కోసం 25 ఏళ్ల ఆనంద్ కల్లూర్‌ను నియమించాడు. ఈ క్రమంలో ఆనంద్‌కు అశ్వినితో పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. భర్తను వదిలించుకోవాలని అశ్విని భావించి, ఆనంద్‌తో కలిసి హత్యకు ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. రాజశేఖర్ ప్రతిరోజూ ఉదయం వాకింగ్‌కు వెళ్లే సమయాన్ని, ఆయన కదలికలను అశ్విని ఆనంద్‌కు తెలియజేసింది.

వాకింగ్‌కు వెళ్లిన సమయంలో కారుతో ఢీకొట్టి..

ఘటన జరిగిన రోజు తెల్లవారుజామున రాజశేఖర్ వాకింగ్‌ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న ఆనంద్, తన సహచరులతో కలిసి నంబర్ ప్లేట్ లేని నల్లటి స్కార్పియోలో ఆయన కదలికలను గమనించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. రాజశేఖర్ వెనుక నుంచి వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు దర్యాప్తులో అనుమానిస్తున్నారు. ఈ ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా చూపించి పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవాలనుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

భార్య సహా నలుగురు నిందితులు అరెస్ట్

ఈ కేసులో రాజశేఖర్ భార్య అశ్విని బిరాదర్ (30), ఆమె ప్రియుడు ఆనంద్ కల్లూర్ (25), సచిన్ బడల్లి (24), మరో మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పదేళ్ల వైవాహిక జీవితంలో ఇద్దరు కవల కుమారులు ఉన్నప్పటికీ, కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Follow Us