Love Story: భారత దేశంలో వివాహానికి ప్రత్యేక స్థానం ఉంది. సంప్రదాయబద్ధంగా జరిగే వివాహ తంతుకు విశిష్ట ప్రాధాన్యతనిస్తారు ప్రజలు. అయితే, ప్రస్తుతం కాలం మారుతోంది. కాలంతో పాటు మనుషుల ప్రవర్తనలు, ఆలోచనా విధానాలూ మారుతున్నాయి. వివాహ వ్యవస్థకు విలువే లేకుండా చేస్తున్నారు కొంతమంది. పెళ్లిని అడ్డుపెట్టుకుని దారుణాతి దారుణాలకు పాల్పడుతున్నారు. పెళ్లి పేరుతో మనుషులను మోసం చేస్తూ నయవంచన చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. ఉషాపాల్ అనే మహిళ రైల్వే స్టేషన్‌లో టీ స్టాల్ పెట్టుకుని జీవనం సాగించేది. అయితే, బాధిత వ్యక్తి ఓ రోజు ఆ టీ స్టాల్ వద్దకు వెళ్లి టీ తాగాడు. అప్పటి నుంచి రెగ్యూలర్‌గా ఆ టీ స్టాల్ వద్దకు వెళ్లడం, టీ తాగడం పరిపాటి అయ్యింది. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్ల పాటు ప్రేమ బంధాన్ని కొనసాగించిన వీరిద్దరూ.. కొన్ని నెలల క్రితం కోర్టు సాక్షిగా మనువాడారు. పెళ్లి అయిన కొద్ది రోజుల వరకు అంతా సవ్యంగా సాగింది వీరి జీవితం. ఆ తరువాత అసలు డ్రామాను స్టార్ట్ చేసి ఆ మహిళ.
ముందుగా నగలు డిమాండ్ చేసింది. దాంతో భార్య ముచ్చట పడుతుంది కదా అని ఆమె బంగారు గొలుసు, చెవిపోగులు, ఇతర ఆభరణాలు, వస్తువులు కొని ఇచ్చాడు. బ్యాంకు ఖాతాలో దాచుకున్న సొమ్మును కూడా తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు. ఇదే అదునుగా భావించిన ఆ కేడీ లేడీ.. భర్తను బజారు నుంచి సరుకులు తీసుకురావాలని కోరింది. భార్య చెప్పిన మేరకు సరుకుల కోసం బాజరుకు వెళ్లాడు ఆ వ్యక్తి. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఊహించిన ట్విస్ట్ ఇచ్చింది భార్య. ఆమె ఇంట్లో కనిపించలేదు. భార్య కోసం ఇళ్లంతా వెతికినా కనిపించలేదు. పైగా రెండు లక్షల రూపాయల నగదు, నగలు కూడా మాయమయ్యాయి.
భార్య ఎక్కడికి వెళ్లిందా? అని ఆరా తీసిన భర్తకు షాకింగ్ విషయాలు తెలియడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. తన భార్యకు ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని, పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకుని షాక్ అయ్యాడు. తన భార్య తనను దారుణంగా మోసం చేసిందని వాపోయాడు. భార్య కోసం లక్షల రూపాయలు వెచ్చించానని చెప్పాడు. భూమిని కూడా అమ్ముకున్నానని, ఇప్పుడు తన భార్య తన వద్దకు రావడం లేదని వాపోయాడు. తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధిత వ్యక్తి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read: