పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో ఎన్ఆర్‌సీ, సీఏఏ చట్టాలను అమలు చేసేదే లేదని మరోసారి స్పష్టం చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మమతా ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మాట్లాడిన మమతా.. కేంద్రంపై, హోం మంత్రి అమిత్ షాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
అమిత్ షా కేవలం బీజేపీ నాయకుడు కాదని.. ఇప్పుడు దేశానికి హోంమంత్రి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మమతా హితవు పలికారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి దేశాన్ని విభజిస్తున్నారని దీదీ విమర్శించారు. పౌరసత్వానికి ఆధార్ ఒక ధ్రువపత్రం కాదని అమిత్ షా అంటున్నారు. మరి సంక్షేమ పథకాల నుంచి బ్యాంకింగ్ రంగం వరకు ఆధార్ నంబర్‌ను ఎందుకు అనుసంధానం చేశారు అని మమతా ప్రశ్నించారు. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ తీసుకొస్తామని చెప్పి.. సబ్‌కే సాత్ సర్వనాశ్ చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం దేశం మొత్తాన్ని ఒక నిర్భంధ కేంద్రంగా మార్చాలని చూస్తోందని.. కానీ తాము ఆ పని చేయనీయబోమని మమతా చెప్పుకొచ్చారు.