Vice President: కౌన్‌బనేగా నెక్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌..! ధన్‌ఖడ్‌ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరనే చర్చ..!!

ఉపరాష్ట్రపతి కుర్చీని జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఖాళీ చేయడంతో... ఆయన వారసుడి కోసం కసరత్తు జరుగుతోంది. కేంద్రం పెద్దలు చాలా మంది ప్రొఫైల్‌ తెప్పించుకొని సీరియస్‌గా స్టడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెక్ట్స్‌ ఉపరాష్ట్రపతి ఎవరనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీజేపీతోపాటు ఎన్డీయే పక్షాలకు చెందిన నేతల పేర్లు కూడా...

Vice President: కౌన్‌బనేగా నెక్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌..! ధన్‌ఖడ్‌ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరనే చర్చ..!!
Vice President

Updated on: Jul 23, 2025 | 6:44 AM

ఉపరాష్ట్రపతి కుర్చీని జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఖాళీ చేయడంతో… ఆయన వారసుడి కోసం కసరత్తు జరుగుతోంది. కేంద్రం పెద్దలు చాలా మంది ప్రొఫైల్‌ తెప్పించుకొని సీరియస్‌గా స్టడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెక్ట్స్‌ ఉపరాష్ట్రపతి ఎవరనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీజేపీతోపాటు ఎన్డీయే పక్షాలకు చెందిన నేతల పేర్లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే హరివంశ్ సింగ్‌ మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలువడం ఆసక్తిగా మారింది.

బిహార్‌కు చెందిన హరివంశ్‌కు రాజకీయాలలో అనుభవజ్ఞునిగా పేరుంది. ఆయన తొలిసారి 2014లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆర్థికశాస్త్రంలో పీజీ చేసియన ఆయన.. రాజకీయాల్లోకి రాకముందు చాలా ఏళ్లు జర్నలిస్టుగా పనిచేశారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు సలహాదారుగానూ పని చేశారు. ఆ ప్రభుత్వం కూలిపోవడంతో మళ్లీ జర్నలిజంలోకి వచ్చేశారు. నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని JDU నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2020 నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండనుండటంతో హరివంశ్‌నే ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే ప్రభుత్వం నియమించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

ఇక రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన 60 రోజుల్లోపు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక తప్పనిసరి. అంటే ఈ ప్రక్రియ సెప్టెంబర్ 19 నాటికి పూర్తి కావాలి. దీంతో త్వరలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 68 (2) కింద ఎన్నిక నిర్వహిస్తారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి పదవిని చేపట్టిన రోజు నుంచి ఐదేళ్లపాటు ఉప రాష్ట్రపతిగా కొనసాగుతారు. దీని ప్రకారం తదుపరి ఉప రాష్ట్రపతి ఎన్నికను సాధ్యమైనంత త్వరగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఉప రాష్ట్రపతిని పార్లమెంట్‌ ఉభయ సభల ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. 245 మంది రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్సభ ఎంపీలతో కలుపుకొని మొత్తం 788 మంది ఈ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకొని ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. దామాషా ప్రాతినిధ్యం ప్రకారం రహస్య బ్యాలెట్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. మరి బీజేపీ ధన్‌ఖర్ వారసుడిగా ఎవరి తీసుకొస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.