Lok Sabha Speaker: ప్రధాని మోదీ లేకుండా ఎన్డీఏ నేతల భేటీ.. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎంపికపై చర్చ

లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హ్యాట్రిక్ విజయం సాధించిన నరేంద్ర మోదీ.. మూడోసారి భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు 72 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Lok Sabha Speaker: ప్రధాని మోదీ లేకుండా ఎన్డీఏ నేతల భేటీ.. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎంపికపై చర్చ
Lok Sabha

Updated on: Jun 19, 2024 | 7:36 AM

లోక్‌సభ స్పీకర్‌ సీటుపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. ఈసారి ఎవరిని కూర్చోబెడదాం..? ఎవరికిస్తే బాగుంటున్న దానిపై ఓ క్లారిటీకొచ్చేందుకు ఎన్డీఏ కూటమి భేటీ అయ్యింది. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హ్యాట్రిక్ విజయం సాధించిన నరేంద్ర మోదీ.. మూడోసారి భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు 72 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు సైతం పూర్తి అయ్యింది. దీంతో ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ పదవిపై దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ అధ్యక్ష పదవి ఏ పార్టీకి చెందిన వ్యక్తికి దక్కుతుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సారి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ సీట్లు బీజేపీకి సొంతంగా రాకపోవడంతో… లోక్‌సభ అధ్యక్ష పదవిపై రాజకీయం నడుస్తోంది.

సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభలో బలం పెంచుకున్న విపక్ష పార్టీలు.. ఈసారి స్పీకర్‌ ఎన్నికపై కన్నేశాయి. తమకు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నాయి. ఒకవేళ అలా ఇవ్వకుంటే, స్పీకర్‌ ఎన్నిక నిర్వహించాలనే డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో దశాబ్దాలుగా ఏకాభిప్రాయంతోనే జరుగుతున్న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక సంప్రదాయానికి తెర పడుతుందా..? అన్న చర్చ ఊపందుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఎన్డీయే కూటమి నేతలు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఢిల్లీలోని రాజ్‌నాథ్‌ నివాసంలో భేటీ అయ్యారు ఎన్డీయే కూటమి నేతలు. ప్రధాని మోదీ అందుబాటులో లేనప్పటికీ కిరణ్ రిజుజు, జైశంకర్, ధర్మేంద్ర, చిరాగ్‌తో పాటు పలువురు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ విషయంలో ఎన్డీయే పక్షాలతో పాటు విపక్షాల్లోనూ ఏకాభిప్రాయం సాధించేలా ఎలా కసరత్తు సాగించాలనే దానిపై మంత్రులు చర్చించారు. మరి స్పీకర్‌ ఎవరు….? అలాగే డిప్యూటీ స్పీకర్‌ కావాలంటున్న విపక్షకూటమి డిమాండ్‌ను ప్రధాని మోదీకే వదిలేశారు. ప్రస్తుతం వారణాసిలో ఉన్న ఆయన వచ్చాకే మరోసారి భేటీ అయ్యి. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎవరన్నదానిపై క్లారిటీకి రానున్నట్లుగా తెలుస్తోంది.

ఇక లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయం కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది ఎన్డీఏ. విపక్షాలను ఒకతాటిపైకి తెచ్చి తాము అనుకున్న వ్యక్తికే అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఎన్డీఏ కూటమిలో కీ రోల్‌ ప్లే చేస్తున్న టీడీపీ, జేడీయూ పార్టీలు స్పీకర్‌ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో కూడా కీలకమైన హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశీ వంటి శాఖలన్నీ బీజేపీ తమ వద్దే ఉంచుకుంది. దీంతో స్పీకర్ పదవి ఎట్టి పరిస్థితుల్లో తమకు ఇవ్వాలని టీడీపీ, జేడీయూ కోరుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి ఇండియా కూటమి బలంగా ఉండటం, సభ వ్యవహారాలు నడపటం కీలకంగా మారడంతో… స్పీకర్ పదవిని బీజేపీకి చెందిన వ్యక్తికే ఇవ్వాలని కాషాయ పార్టీ హై కమాండ్ భావిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వారసులుగా బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌కు దగ్డబాటి పురందేశ్వరి పేరు బలంగా వినిపిస్తోంది. ఆమెతోపాటు ఒడిశా నుంచి బీజేపీలో చేరిన కటక్‌ ఎంపీ ఎంపీ భర్తృహరి మహతాబ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. ఓం బిర్లానే మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా నియమించే అవకాశం ఉందంటూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇక రాజ్యాంగ నిబంధనలు ప్రకారం కొత్త లోక్‌సభ మొదటి సారి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. కొత్త ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించడానికి సభలోని సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా రాష్ట్రపతి నియమిస్తారు. ప్రొటెం స్పీకర్‌ రేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కొడికున్నిల్‌ సురేశ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎనిమిది సార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన సురేష్ పార్లమెంటరీ అనుభవం పరంగా అత్యంత సీనియర్ కావడం కలిసివచ్చే అంశం.

మొత్తంగా… ఎన్నికలో 233 స్థానాల్లో గెలుపొందిన విపక్ష ఇండియా కూటమి.. డిప్యూటీ స్పీకర్‌ పదవి విషయంలో తగ్గేదేలే అంటోంది. లేదంటే స్పీకర్‌ ఎన్నిక జరగాల్సిందేనన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే కీలక నేతలు సైతం స్పీకర్‌ విషయంలో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ప్రధానే నిర్ణయం తీసుకోవాలని మోదీవైపే చూస్తున్నారు. ప్రొటెం స్పీకర్‌, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎవరనేది ఈ రోజు సాయంత్ర ఎన్డీయే, దాని మిత్రపక్ష పార్టీల కేంద్రమంత్రుల సమావేశం అనంతరం స్పష్టత రానుంది. మరి చూడాలి…ఏం జరుగుతుందో..! ప్రధాని మోదీ ఎలాంటి మేజిక్‌ చేస్తారో !

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..