AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NOTA Votes: ఎన్నికల్లో అందరి కంటే ఎక్కువ ఓట్లు నోటాకు వస్తే ఏమవుతుంది?

ప్రజలు ఎన్నుకున్న నేతలే పాలకులుగా మారే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకం. కాలానుగుణంగా ఈ ఎన్నికల ప్రక్రియలో మార్పులు, సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి. వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీలో నిలిచే అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడుతూ ఉంటారు. వారిలో ఓటర్లు తమకు నచ్చినవారికి ఓటేయడం.. అలా ఎక్కువ ఓట్లు వచ్చినవారిని విజేతగా ప్రకటించడం చూస్తూనే ఉన్నాం.

NOTA Votes: ఎన్నికల్లో అందరి కంటే ఎక్కువ ఓట్లు నోటాకు వస్తే ఏమవుతుంది?
Nota Vote
Mahatma Kodiyar
| Edited By: Balaraju Goud|

Updated on: Apr 07, 2024 | 12:40 PM

Share

ప్రజలు ఎన్నుకున్న నేతలే పాలకులుగా మారే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకం. కాలానుగుణంగా ఈ ఎన్నికల ప్రక్రియలో మార్పులు, సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి. వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీలో నిలిచే అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడుతూ ఉంటారు. వారిలో ఓటర్లు తమకు నచ్చినవారికి ఓటేయడం.. అలా ఎక్కువ ఓట్లు వచ్చినవారిని విజేతగా ప్రకటించడం చూస్తూనే ఉన్నాం.

సాధారణంగా ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ అభిప్రాయం ప్రకారమే నడచుకోవాలని అర్థం. కానీ ఈ ప్రక్రియలోనూ తరచి చూస్తే లోపాలు కనిపిస్తాయి. ఉదాహరణకు 100 ఓట్లు ఉన్న ఓ నియోజకవర్గంలో నాలుగైదు పార్టీలు, ఒకరిద్దరు స్వతంత్రులు పోటీ చేశారని అనుకుందాం. వారిలో ఒక అభ్యర్థికి 25 ఓట్లు, మిగతా అభ్యర్థులు, స్వతంత్రులకు 20 ఓట్ల కంటే తక్కువ వచ్చాయని అనుకుందాం. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం 25 ఓట్లు పొందిన అభ్యర్థి గెలిచినట్టు లెక్క. కానీ నిజానికి ఆ అభ్యర్థిని వద్దు అనుకున్న ఓటర్లు 75 మంది ఉన్నారు. అందుకే వారు తమకు నచ్చిన ఇతర అభ్యర్థికి ఓటేశారు. కానీ ఓటర్లు నిరాకరించడం అనేది లెక్కలోకి రావడం లేదు. కాబట్టి మెజారిటీ ప్రజలు అంగీకరించకపోయినా సరే ఈ ఎన్నికల ప్రక్రియలో గెలుపొందే అవకాశం ఉంది.

అయితే ఒక్కోసారి పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ ఓటరుకు నచ్చలేదంటే.. తన వ్యతిరేకతను తెలియజేయడానికి ఒకటే మార్గం ఉండేది. అది పూర్తిగా ఎన్నికలను బహిష్కరచడమే. సాధారణ పరిస్థితుల్లోనే 100 ఓట్లకు పోలవుతున్నది గరిష్టంగా 70 శాతం కూడా ఉండడం లేదు. పట్టణ ప్రాంతాల్లో 50 శాతం ఓట్లు పోలైతే గొప్ప విషయంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు నచ్చలేదని ఓటేయడం మానేస్తే.. ఆ ఎన్నికలకు అర్థమే లేకుండా పోతుంది. అందుకే అభ్యర్థులు నచ్చకపోయినా సరే.. ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన సరికొత్త అవకాశమే నోటా (NOTA). None Of The Above కు సంక్షిప్త రూపమే NOTA. అంటే “పైనున్న అభ్యర్థులెవరూ కాదు” అని దాని అర్థం. అభ్యర్థుల పేర్లతో పాటు నోటా (NOTA) కూడా ఒక గుర్తును కలిగి, ఈవీఎం (EVM)లో అన్నింటి కంటే చివరను ఉంటుంది. అభ్యర్థుల జాబితాలో ఏ ఒక్కరూ నచ్చలేదు అనుకున్నప్పుడు ఓటరు ఈ నోటా(NOTA)కు ఓటు వేయవచ్చు.

నోటా పాత్ర ఏంటి?

కేంద్ర ఎన్నికల సంఘం నోటా (NOTA)ను అందుబాటులో తేవడం వరకు ఓకే. అభ్యర్థుల గుణగణాలు పరిశీలించి.. ఎవరూ నచ్చలేదని నిర్ణయించుకుని ఓటేసే ప్రజలు 100 మందిలో ఒకరిద్దరు ఉంటే ఎక్కువ. అటూ ఇటూగా సగటున 1 శాతం లోపే ఈ గుర్తుకు ఓట్లు పోలవుతుంటాయి. ఈ మధ్యన 2023 ఏడాది చివర్లో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా 1.5 శాతం ఓట్లు నోటాకు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. తద్వారా ఆ మేరకు ఓటర్లు తమ నిరసన వ్యక్తం చేసినట్టు రికార్డవుతోంది. కానీ ఒకవేళ పోటీలో ఉన్న అభ్యర్థులందరి కంటే ఎక్కువ ఓట్లు నోటా సాధిస్తే ఏమవుతుంది? ఇదే ప్రశ్న ఓటు వేయడానికి వెళ్లే చాలామంది మదిలో మెదులుతూ ఉంటుంది. చట్టసభలకు (అసెంబ్లీ, లోక్‌సభ) జరిగే ఎన్నికల్లో ఒకవేళ ఎక్కడైనా నోటాకు అత్యధిక ఓట్లు పడ్డాయంటే.. అక్కడ ద్వితీయ స్థానంలో నిలిచిన అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అంటే మెజారిటీ ప్రజలు అభ్యర్థులను తిరస్కరించినా సరే.. వారి తిరస్కరణకు ఫలితం లేకుండా పోతోంది.

ఇదే అంశంపై సుప్రీంకోర్టులోనూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలయ్యాయి. హోరాహోరీగా వాదనలు జరిగాయి. తమ అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో పిటిషనర్లు కొన్ని సూచనలు చేశారు. ఓటర్ల తిరస్కరణను కచ్చితంగా గుర్తించాలని, ఎక్కడైనా నోటా అత్యధిక ఓట్లు సాధిస్తే.. అక్కడ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, రద్దయిన ఎన్నికల్లోని అభ్యర్థులు మళ్లీ పోటీ చేయడానికి వీల్లేకుండా నిబంధనలు పెట్టాలని సూచించారు. రెండోసారి కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే అన్న ప్రశ్న తలెత్తింది. ఓటర్లను ప్రభావితం చేయగల సంస్థలు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తే పదే పదే నోటాకే ఓట్లు వేయించే అవకాశం కూడా ఉంటుందని, మొత్తంగా ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతుందన్న చర్చ కూడా జరిగింది.

సర్వోన్నత న్యాయస్థానంలో కేసుల సంగతి ఇలా ఉంటే.. ఇప్పటికీ నోటా అంటే ‘కోరల్లేని పులి’ మాదిరిగానే మిగిలిపోయింది. అయితే నోటా ఎన్నికలలో సాధారణ ప్రజల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచుతుంది. ఈ ఆప్షన్‌తో ఓటరు తన అయిష్టాన్ని వ్యక్తం చేయడానికి ఆస్కారం ఉంది. తద్వారా తాము నిలబెట్టిన అభ్యర్థులను ప్రజలు అంగీకరించరని, మంచి అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీలకు సందేశం కూడా పంపినట్టవుతుంది. నోటా లేని కాలంలో ఓటరు ఏ అభ్యర్థినీ ఇష్టపడకపోతే.. ఓటు వేయడానికి ముందుకొచ్చేవాడు కాదు. దీంతో ఆ ఓటు వృథా అయ్యేది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలు

ప్రజలు తిరస్కరించిన అభ్యర్థులను మళ్లీ పోటీ చేయడానికి వీల్లేకుండా చేయాలన్న వాదన దేశంలోని కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలయింది. నోటా నిబంధనలలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొదట్లో నోటాను అక్రమ ఓటుగా పరిగణించారు. అంటే, మిగతా అభ్యర్థులందరి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే, రెండో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తూ వచ్చారు. చివరకు 2018లో దేశంలోనే తొలిసారిగా నోటాకు అభ్యర్థులకు సమాన హోదా కల్పించారు. డిసెంబర్ 2018లో హర్యానాలోని ఐదు జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల నోటా అత్యధిక ఓట్లను పొందింది. అటువంటి పరిస్థితిలో అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం 2018 ఆ రాష్ట్రంలో నోటాకు ‘కల్పిత ఎన్నికల అభ్యర్థి’ హోదా ఇచ్చింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ఒక అభ్యర్థి ‘ఊహాత్మక అభ్యర్థి’గా ఉన్న నోటాకు, వాస్తవ అభ్యర్థికి సమానమైన ఓట్లు వస్తే అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే నిజమైన అభ్యర్థి విజేతగా నిలుస్తాడు. అన్నింటి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో పర్యాయం కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే మూడో సారి ఎన్నికలు నిర్వహించరు. అటువంటి పరిస్థితిలో నోటా తర్వాత ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అయితే మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నియమాలను రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే పరిమితం చేసింది. ఈ తరహా మార్పులు, సంస్కరణలు చట్టసభలకు జరిగే ఎన్నికల్లోనూ అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. అప్పటి వరకు నోటా అంటే ‘కోరల్లేని పులి’ మాత్రమే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..