
పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హయాంలో తొలి ఎన్‌కౌంటర్ కేసు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ పోలీసులు ఉత్తర దినాజ్‌పూర్‌లో మాఫియా డాన్‌ను కాల్చిచంపారు. అతను జైలు వ్యాన్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులపై దాడికి తెగబడ్డాడు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అతను ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఎవరైనా ఒక్క బుల్లెట్ పేల్చితే నాలుగు బుల్లెట్‌లు కాల్చేస్తామని పశ్చిమ బెంగాల్ డీజీ రాజీవ్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే..!
సీఎం మమతా బెనర్జీ హయాంలో ఒక నేరస్థుడిని ఎన్‌కౌంటర్ చేసి చంపడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఉత్తరప్రదేశ్ గత కొన్నేళ్లుగా నేరస్తులను ఎన్‌కౌంటర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అయితే పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి కేసు ఇదే తొలిసారి. గత 14 ఏళ్లుగా మమతా బెనర్జీ బెంగాల్‌ను పాలిస్తున్నారు. 70 ఏళ్ల మమత తొలిసారిగా 20 మే 2011న రాష్ట్ర బాధ్యతలు చేపట్టారు. 2016 మే 27న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత, 2021 సంవత్సరంలో ఆమె పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. మమత వరుసగా మూడవసారి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు.
ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో జిల్లాలోని గ్వాల్‌పోఖర్‌లోని కిచకట్లలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అండర్ ట్రయల్ ఖైదీ సజ్జక్ ఆలం మరణించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మూడు రోజుల క్రితం కోర్టుకు వెళ్లి వస్తుండగా, పోలీస్ వ్యాన్ నుంచి తప్పించుకున్నాడు. కీచకట్ల ప్రాంతంలో దాక్కున్నట్లు సమాచారం అందుకున్న తరువాత, అక్కడ తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పోలీసులపై కాల్పులు ప్రారంభించాడు. దానికి ప్రతీకారంగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఇందులో ఆలం గాయపడ్డాడు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను మరణించినట్లు దినాజ్‌పూర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
బుధవారం(జనవరి 15 ) నార్త్ దినాజ్‌పూర్‌లోని రాయ్‌గంజ్‌లో, ఆలంతోపాటు మరో అండర్‌ట్రయల్ ఖైదీ ఇద్దరు పోలీసుల నుండి రివాల్వర్‌లను లాక్కొని, వారిపై కాల్పులు జరిపి గాయపరిచారని, ఆపై వారిద్దరూ పారిపోయారని పోలీసులు చెప్పారు. పోలీసులు ఈ ఖైదీలను ఇస్లాంపూర్‌లోని కోర్టు నుండి జైలు వాహనంలో సెంట్రల్ కరెక్షనల్ హోమ్‌కు తీసుకువెళుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. జనవరి 15న జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడు బంగ్లాదేశ్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. అతనికి సహాయం చేసిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. 2019లో ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని కరాండిఘిలో జరిగిన హత్య కేసులో ఆలం ప్రధాన నిందితుడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..