Mamata Banerjee: మమతా బెనర్జీ కొత్త పాలసీ.. ఊడిపోతున్న పదవులతో నేతలు, అధికారుల బెంబేలు

|

Aug 18, 2021 | 6:05 PM

'వన్‌ పర్సన్‌.. వన్‌ పోస్ట్‌'.. ఇదీ దీదీ పాలసీ. ఇటీవలి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మమతాబెనర్జీ తన మార్క్‌ పాలనకు శ్రీకారం చుట్టారు. ఒక్కక్కరి పోస్టులు ఊడబీకుతూ ఉరుకులు.. పరుగులు

Mamata Banerjee: మమతా బెనర్జీ కొత్త పాలసీ.. ఊడిపోతున్న పదవులతో నేతలు, అధికారుల బెంబేలు
Mamata Banerjee
Follow us on

West Bengal CM Mamata Banerjee: ‘వన్‌ పర్సన్‌.. వన్‌ పోస్ట్‌’.. ఇదీ దీదీ పాలసీ. ఇటీవలి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మమతాబెనర్జీ తన మార్క్‌ పాలనకు శ్రీకారం చుట్టారు. ఒక్కక్కరి పోస్టులు ఊడబీకుతూ ఉరుకులు.. పరుగులు పెట్టిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో వినూత్న సంస్కరణలు తీసుకొస్తున్నారు. అటు పార్టీ.. ఇటు ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. ఇందులో భాగంగానే వన్‌ పర్సన్‌.. వన్‌ పోస్ట్‌ అంటూ కొత్త పాలసీని భుజానికెత్తున్నారు. ఈ పాలసీ ప్రకారం.. ఒక్కో నేతకు ఒకే పోస్ట్‌ లభించనుంది. ఇక నుంచి రాష్ట్రంలో ఒకే వ్యక్తి వివిధ పోస్టుల్లో కొనసాగడం కుదరదు.

ఇందులో భాగంగా ఇప్పటికే 100 మున్సిపాలిటీల్లో కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు సీఎం మమత. పాత లీడర్లను సాగనంపుతూ కొత్తవారిని చైర్మన్‌ పోస్టుల్లో కూర్చోబెట్టారు సీఎం మమతా బెనర్జీ. మంత్రులుగా కొనసాగుతూనే.. మున్సిపాలిటీల్లో అడ్మినిస్ట్రేటర్స్‌గా కంటిన్యూ అవుతున్న అరుప్‌ రాయ్‌, రథిన్‌ ఘోష్‌, సుజిత్‌ బసు లాంటి నేతల్ని ఇప్పటికే ఆయా పోస్టుల నుంచి తొలగించారు. ఉత్తర్‌పర, కొన్నగర్‌, రిష్రా, భద్రేశ్వర్‌, బైద్యబాటి, సీరంపూర్‌, తార్కేశ్వర్‌, అరంబాగ్‌ వంటి మున్సిపాలిటీల్లో ఇప్పటికే చైర్మన్‌ పోస్టుల్లో మరొకరికి అవకాశం కల్పించారు.

అందరికీ అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో సీఎం మమతా బెనర్జీ వన్‌ పర్సన్‌.. వన్‌ పోస్ట్‌ పాలసీ తీసుకొచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చారు మమతా బెనర్జీ. మొదటి నుంచీ పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం కల్పించాలని మమతా బెనర్జీ భావిస్తున్నట్టు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కరు ఒకే పోస్టులో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని TMC వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read also: ఏపీలో ఉప్పొంగుతోన్న వాగులు, కొట్టుకుపోయిన వట్టిగెడ్డ కాజ్వే బ్రిడ్జి.. కట్టలేరుకు వరద ఉధృతి, తెగిన రాకపోకలు