
తమిళనాడులో టెంపుల్ టూరిజంతో పాటు పర్యటకంగా కూడా అనేక ప్రాంతాలు ప్రాచుర్యం పొందాయి. వాటిలో ఊటీ, కొడైకెనాల్ కూడా ప్రధానమైనవి. ఊటీ, కొడైకెనాల్ హిల్ ప్రాంతాల్లో నిత్యం వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. ఊటీ నీలగిరి కొండల్లో ఉంటుంది. ఇక కొడైకెనాల్ దిండుగల్ నుంచి సమీపంలోని కొండల్లో ఉన్న మరో పర్యాటక ప్రాంతం. ఇవి ఎత్తైన కొండ ప్రాంతాలు.. అలాగే ఇక్కడ తేయాకు, కాఫీ తోటలు కూడా ఎక్కువే.. పచ్చని పర్యావరణంతో పర్యాటకులను ఇట్టే ఆకట్టుకునే ఈ ప్రాంతాల్లో వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. మండు వేసవిలో ఇక్కడి వాతావరణాన్ని అనుభూతి చెందడంతో పాటు మంచు దృశ్యాలు ఇక్కడ పర్యాటకులను ఇట్టే కట్టి పడేస్తుంటాయి. అక్టోబర్ నుంచే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాల్లో ఇప్పటికే హోటళ్లు, అతిధి గృహాలన్ని పూర్తిగా బుక్కయ్యాయి.. ఈ రెండు ప్రాంతాలను సందర్శించేందుకు ఇప్పటికే పర్యాటకులు ఏర్పాట్లు చేసుకోగా ఒక ప్రకటన నిరుత్సాహానికి గురిచేసింది. అదే వాతావరణ శాఖ, తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రకటన సారాంశం ఇదే.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చాలా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుంచి మరింత వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. కాంచీపురం, కార్తెక్కల్, కడలూరు, దిండుగల్, నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు గాలుల వేగం కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. నీలగిరి, కోతగిరి కొండల్లో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.. గతంలో అనేక సందర్భాల్లో కొండచరియలు విరిగిపడి పర్యాటకులు ప్రయాణించే కార్లపై పడి అనేక మంది.మృత్యువాత పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.. ఆ సమయంలో సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడ్డ సందర్భాలను అధికారులు ఉదాహరిస్తున్నారు.
కాబట్టి మరో రెండు వారాల పాటు పర్యాటకులు ముందు జాగ్రత్త కోసం పర్యటనను వాయిదా వేసుకోవడం మంచిదని అంటున్నారు.. తదుపరి వాతావరణ ప్రకటన తర్వాత ఊటీ, కొడైకెనాల్ సందర్శించడం కోసం రావొచ్చని అంటున్నారు. దీంతో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను గమనించి కొందరు ఇప్పటికే తమ పర్యటనలను కొందరు వాయిదా వేసుకుంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..