Wayanad Landslide: అయ్యో.. ప్రాణాల కోసం పోరాడి ఓడారు! ఒకరినొకరు పెనవేసుకుని.. ఆ ఇంట హృదయవిదారక దృశ్యం

|

Aug 01, 2024 | 4:32 PM

కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి సృష్టించిన పెను విపత్తు ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేశాయి. సోమవారం అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో మండక్కై, చూరాల్‌మల ప్రాంతాలు నామరూపాల్లేకుండా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ముందక్కై మృత్యు భూమిగా మారిపోయింది..

Wayanad Landslide: అయ్యో.. ప్రాణాల కోసం పోరాడి ఓడారు! ఒకరినొకరు పెనవేసుకుని.. ఆ ఇంట హృదయవిదారక దృశ్యం
Wayanad Tragedy
Follow us on

వయనాడ్, ఆగస్టు 1: కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి సృష్టించిన పెను విపత్తు ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేశాయి. సోమవారం అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో మండక్కై, చూరాల్‌మల ప్రాంతాలు నామరూపాల్లేకుండా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ముందక్కై మృత్యు భూమిగా మారిపోయింది. ఎక్కడ చూసినా మట్టి, నీరు, భారీ రాళ్లు, నేలకొరిగిన చెట్లు, భవనాల అవశేషాలతో భీతావాహకంగా మారింది. ప్రమాదంలో మిగిలిన ప్రాణాలను కాపాడటంతో భారత సైన్యం నిమగ్నమైంది. శిధిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీస్తుంది. మృతదేహాలను వెలికితీసే క్రమంలో కొన్ని దృశ్యాలు కంటనీరు పెట్టించినట్లు రెస్క్యూటీం వెల్లడించింది. కొన్ని చోట్ల బాధితులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ఇంకా సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. వారిని వీలైనంత త్వరగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సైన్యం సహాయక చర్యలను వేగవంతం చేసింది. భవన అవశేషాల మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య 183కి చేరుకోగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వర్షం కాస్త శాంతించినా.. ముందక్కై ప్రాంతమంతా బురద, వరద నీటితో నిండిపోయింది. ఎక్కడ కూడా నిలబడే పరిస్థితి లేదు. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ముఖ్యంగా భారీ కొండ రాళ్లను తొలగించడానికి యంత్రాలను అక్కడికి చేర్చడం ఇబ్బందిగా మారింది. చూరల్‌మలలో బెయిలీ వంతెన కూలడంతో నీరు శరవేగంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రెస్క్యూ టీం ముందుకు సాగలేకపోతుంది. ఆర్మీ, నేవీ సహాయక చర్యలు చేపడుతున్నాయి. అక్కడ వంతెన నిర్మానం పూర్తయితే మరిన్ని యంత్రాలను అక్కడికి చేరవేయాలని భావిస్తున్నారు. చూర‌ల్‌మ‌లలో కూలిన ఓఇంటి నుంచి పసిబిడ్డ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాలను పసిగట్టేందుకు జాగిలాల సేవలు వినియోగిస్తున్నారు. వీటి సాయంతో భూగర్భంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి. జాగిలాలు ఇచ్చే క్లూలను బట్టి రెస్క్యూ వర్కర్లు శిధిలాల కింద ఉన్న ఇళ్లను కూల్చివేసి మృతదేహాలను వెలికితీస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయని రెస్క్యూ వర్కర్లు చెబుతున్నారు.

ముండక్కైలోని ఓ ఇంట్లో కుర్చీలపై కూర్చున్న ముగ్గురు మృతదేహాలను గుర్తించారు. ఓ కుటుంబం సర్వశక్తులను ఒడిగట్టి ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించే దయనీయ స్థితి ప్రతి ఒక్కరినీ కంటనీరు తెప్పించింది. చిన్నారులతో సహా ఐదారుగురు మృతదేహాలు ఒకరినొకరు కౌగిలించుకున్న దృశ్యం కలచివేసింది. దాదాపు 400 ఇళ్లు ఉన్న ముండక్కైలో ప్రస్తుతం ముప్పై ఇళ్లు మాత్రమే మిగిలున్నాయి. ఇక్కడ ఎంతమంది సజీవంగా ఉన్నారు.. ఎంతమంది మరణించారన్నదానిపై సరైన సమాచారం లేదు. ప్రాణాలతో బయటపడ్డవారు తమ కుటుంబ సభ్యుల జాడ కోసం ఆసుపత్రులను, విపత్తు ప్రాంతాలను కోటి ఆశలతో వెతుకుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.