Sundar Pichai: AI సమ్మిట్‌లో కాఫీ రుచికి మైమరిచిపోయిన సుందర్ పిచాయ్!

AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో గురువారం ఆసక్తికర దృశ్యం కనిపించింది. భారత్ మండపంలో ఏర్పాటు చేసిన భారత్ GI కాఫీ లౌంజ్‌కు వెళ్లిన గూగుల్ CEO సుందర్ పిచాయ్ అక్కడి కాఫీ రుచి చూసి ‘వావ్!’ అంటూ మెచ్చుకున్నారు. మాన్సూన్, మలబార్ అరబికా బ్లెండ్స్‌ను టేస్ట్ చేసిన ఆయన ‘మలబార్ అరబికా’ తన ఫేవరెట్ అని చెప్పడంతో అక్కడి బరిస్టాలు ప్రత్యేకంగా కాఫీ అందించారు.

Sundar Pichai: AI సమ్మిట్‌లో కాఫీ రుచికి మైమరిచిపోయిన సుందర్ పిచాయ్!
Sundar Pichai

Updated on: Feb 19, 2026 | 5:19 PM

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో గురువారం కాసేపు హైటెక్ చర్చలకు బ్రేక్ పడింది. గూగుల్ CEO సుందర్ పిచాయ్ కాఫీ కోసం భారత్ GI కాఫీ లౌంజ్‌కు వెళ్లడం.. అక్కడి కాఫీ రుచి చూసి వావ్! అని అనడం.. అక్కడున్నవారికి స్పెషల్ మోమెంట్‌గా మారింది.
పిచాయ్.. మాన్సూన్‌, మలబార్ అరబికా బ్లెండ్స్‌ను టేస్ట్ చేశారు. ఆ తర్వాత చిరునవ్వుతో “మలబార్ అరబికా” తన ఫేవరెట్ అని చెప్పుకొచ్చారు. ఆయనకు మాన్సూన్ ఫ్లేవర్ అందించగా ఆస్వాదిస్తూ సిప్ చేశారు. అక్కడి బరిస్టాలతో మాట్లాడి, వివిధ బ్లెండ్స్‌ను రుచి చూశారు.

ఈ వీడియోను కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ Xలో షేర్ చేశారు. “సుందర్ పిచాయ్ ఒక సిప్ కోసం వచ్చాడంటే.. ఇది నిజంగా వర్త్ ఇట్! ప్రపంచం మొత్తం భారత్ GI కాఫీకి కప్ ఎత్తుతోంది!”అని పేర్కొన్నారు.

AI సమ్మిట్‌లో అత్యున్నత స్థాయి టెక్ చర్చల మధ్య.. అరకు నుంచి కూర్గ్ వరకు GI ట్యాగ్ ఉన్న భారత ప్రీమియం కాఫీలు ఒక్కసారిగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భారత్ GI కాఫీ లౌంజ్‌ను భారత్ మండపం‌లో (హాల్-14, ఫస్ట్ ఫ్లోర్) ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు ఏర్పాటు చేశారు. ఇది DPIIT ఆధ్వర్యంలో.. వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన భారత్ GI ఇనిషియేటివ్‌లో భాగం.

ఈ లౌంజ్‌లో GI ఉత్పత్తులు, UPI వంటి డిజిటల్ పేమెంట్స్, AI ఆలోచనలు అన్నీ ఒకే చోట కనిపించాయి. భారత సంప్రదాయం.. ఆధునిక టెక్నాలజీ.. కలిసి నడిచే చిత్రంగా ఇది నిలిచింది. హెరిటేజ్‌ను బ్రాండ్‌గా మార్చి.. టెక్నాలజీతో ప్రపంచానికి చేరవేయగల సామర్థ్యం భారత్‌కి ఉందని ఈ కాఫీ లౌంజ్ సూచించినట్లైంది.

ఇదే భారత్ మండపంలో సుందర్ పిచాయ్ కీలక ప్రసంగం చేశారు. తన విద్యార్థి రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. చెన్నై నుంచి IIT ఖరగ్‌పూర్ వరకు ‘కోరోమండల్ ఎక్స్‌ప్రెస్’లో ప్రయాణాలు చేసిన విషయాన్ని చెప్పారు. అలాగే,“వైజాగ్ అప్పట్లో ప్రశాంతమైన నగరం… గొప్ప అవకాశాలున్న ప్రాంతం” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భారత్‌లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిలో భాగంగా.. విశాఖపట్నంలో పూర్తి స్థాయి AI హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ AI హబ్‌లో భారీ స్థాయి కంప్యూటింగ్ పవర్, కొత్త అంతర్జాతీయ అండర్‌సీ కేబుల్ కనెక్షన్ ఉంటాయని పిచాయ్ వెల్లడించారు. దీంతో విశాఖను గ్లోబల్ AI సెంటర్‌గా మార్చే అవకాశం ఏర్పడుతుందని.. భారత్ టెక్నాలజీ రంగంలో ప్రపంచస్థాయిలో మరింత బలంగా నిలుస్తుందని తెలిపారు.

AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో.. ఒకవైపు ప్రపంచ టెక్ దిగ్గజాలు, పాలసీ మేకర్స్ చర్చలు.. మరోవైపు భారత్ GI కాఫీ లౌంజ్‌లో సుందర్ పిచాయ్ లాంటి CEOలు “వావ్!” అనడంతో ఈ సమ్మిట్‌లో కాఫీ కూడా స్టార్ అయిందని చెప్పొచ్చు.

Follow Us