Amit Shah Rally: మాకు ద్రోహం చేశారు.. రేపు మిమ్మల్ని కూడా మోసం చేస్తారు.. లాలూ ప్రసాద్‌కు కేంద్ర మంత్రి అమిత్ షా హెచ్చరిక..

Amit Shah In Bihar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై సూటిగా దాడి చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా.. లాలూ ప్రసాద్‌ను హెచ్చరించారు. ఆయన మాకు ద్రోహం చేశారు.. మీకు కూడా చేస్తారని..

Amit Shah Rally: మాకు ద్రోహం చేశారు.. రేపు మిమ్మల్ని కూడా మోసం చేస్తారు.. లాలూ ప్రసాద్‌కు కేంద్ర మంత్రి అమిత్ షా హెచ్చరిక..
Amit Shah In Bihar

Updated on: Sep 23, 2022 | 3:37 PM

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ప్రత్యక్ష దాడిని మొదలు పెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేంద్ర మంత్రి అమిత్ షా శుక్రవారం బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ‘జన్ భవన మహాసభ’లో ప్రసంగించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీహార్‌లో బీజేపీ సోలో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పేరిట అమిత్ షా ప్రారంభించారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత మొదటిసారి సీఎం నితీష్ కుమార్‌పై విమర్శల దాడి చేశారు. తన ప్రధానమంత్రి ఆశయాన్ని నెరవేర్చుకోవడానికే జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు నితీష్ కుమార్ బీజేపీకి ద్రోహం చేశారని అన్నారు.

బీహార్ ప్రజల ప్రేమ, ఆదరణ కారణంగా పూర్నియాలోని ఈ భారీ మైదానం కూడా చిన్నబోయిందని అన్నారు. లాలూ-నితీష్‌లకు ఈ ర్యాలీ హెచ్చరికగా అభివర్ణించారు. ఈ సందర్భంగా సుశీల్ మోదీ, గిరిరాజ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, రాధామోహన్ సింగ్, రేణుదేవి, విజయ్ సిన్హా సహా పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా అమిత్ షా కూడా మహాకూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన పర్యటన వల్ల లాలూ యాదవ్, నితీష్ కుమార్ లు కడుపు మంటతో బాధపడుతున్నారని అన్నారు. లాలూ ఒడిలో నితీశ్ కూర్చున్నారంటూ సెటైర్లు సంధించారు. నితీశ్ ప్రధాని కావడానికి ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి వెళ్లాయని విమర్శించారు. రాజకీయాల్లో నితీష్ చాలా మందిని మోసం చేశారని.. మోసం చేయడం ఆయనకు కొత్తేమి కాదని అన్నారు.

లాలూ-నితీష్‌లకు హెచ్చరిక..

అధికార ప్రయోజనాల కోసం, ఫిరాయింపులకు పాల్పడే నితీష్‌ ప్రధాని కాగలరా.. బీహార్‌లో ప్రభుత్వాన్ని నడపగలరా.. అంటూ అమిత్ షా దుయ్యబట్టారు. “లాలూజీ వినండి.. రేపు నితీష్ మీకు కూడా ద్రోహం చేస్తారని సూచించారు.

మోదీ ప్రభుత్వం మూడేళ్లలోనే బీహార్‌ను వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తి చేసిందన్నారు. చక్రబంధ, భీంబంధాలతో నక్సలిజం అంతమైందన్నారు. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావంలో ఉన్న బీహార్ ఇప్పుడు దాని నుంచి పూర్తి స్థాయిలో విముక్తి పొందిందని అన్నారు. మోదీ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని గుర్తు చేశారు. 

పూర్నియా జిల్లాలో ‘జన్ భవన మహాసభ’లో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. “నితీష్ కుమార్.. బీజేపీకి వెన్నుపోటు పొడిచారు. రాజకీయ పొత్తులు మార్చుకుని నితీష్ బాబు ప్రధాని కాగలరా?.. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చాలా మందికి నితీశ్ ద్రోహం చేశారు. లాలూ జీ, రేపు మిమ్మల్ని వదిలిపెట్టి నితీష్ బాబు కాంగ్రెస్ ఒడిలో కూర్చుంటారు జాగ్రత్త..! 2014లో మీకుకేవలం 2 లోక్‌సభ స్థానాలు మాత్రమే వచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు రానివ్వండి.. బిహార్ ప్రజలు.. లాలూ-నితీష్ ద్వయాన్ని తుడిచి పెట్టేస్తారు. 2025 ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో ఇక్కడ మేం అధికారంలోకి రాబోతున్నాం. ” –అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

అధికారంలో కూర్చున్న నేరస్థులు..

ఈ సందర్భంగా అమిత్ షా బీహార్ శాంతిభద్రతల పరిస్థితిపై కూడా ప్రశ్నలు సంధించారు. మహాకూటమి ప్రభుత్వం రాగానే ఇక్కడ శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయన్నారు. నితీష్ కుమార్ కుట్రదారులను ఆపలేరు.. ఎందుకంటే నేరగాళ్లు అధికారంలోకి వచ్చారు.. వారిని కట్టడం చేడయం ఇక నితీష్ కుమార్‌తో కాదన్నారు. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులను ఉద్దేశించి ఆయన అమిత్ షా ప్రభుత్వాన్ని ఎద్దేవ చేశారు. మంత్రలపైనే నేరారోపణలు ఉన్నాయని విమర్శించారు. 

 

మరిన్ని జాతీయ వార్తల కోసం