శశికళ రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. తమిళనాడు రాజకీయాల్లోకి మళ్లీ అడుగుపెడుతున్నారు చిన్నమ్మ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను రాజకీయాలకు దూరమవుతున్నట్టు ప్రకటించిన శశికళ.. ఇప్పుడు మనసు మార్చుకున్నారు. కాసేపట్లో తన రీ ఎంట్రీపై కీలక ప్రకటన చేయబోతున్నారు. కాసేఅమ్మ జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటనలకు రెడీ కానున్నారు. తమిళనాడు రాజకీయాల్లో చిన్నమ్మ మళ్లీ హాట్ టాపిక్‌గా మారారు. రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానంటూ జయ నెచ్చెలి చేసిన ప్రకటన ప్రత్యర్థుల్లో ఇప్పటికే గుబులు మొదలైంది. మరోవైపు ఈ నెల 17 నాటికి అన్నాడీఎంకే ఏర్పడి 50 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అన్నాడీఎంకే నేతలు రాష్ట్ర వ్యాప్త వేడుకలకు రెడీ అయ్యారు.
అయితే ఈ సమయాన్నే శశికళ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. కాసేపట్లో చెన్నై మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి దగ్గరకు వెళ్లి.. అమ్మకు నివాళులర్పించనున్నారు శశికళ. ఈ సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాల్లో అన్నాడీఎంకే నేతలకు ఫోన్లు చేసి చెప్పడంతో.. పర్యటన ఏర్పాట్లు చేస్తున్నారు స్థానిక నేతలు.
ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే పరాజయం పాలవడంతో నేతల్లో అభిప్రాయభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీని విజయతీరాలకు చేర్చడంలో ఇటు పన్నీర్‌సెల్వం, అటు పళనిస్వామి ఇద్దరూ విఫలమయ్యారని..పార్టీని నడిపించడం వారి వల్ల కాదని తేలిపోయిందంటోంది అన్నాడీఎంకేలోని ఓ వర్గం. ఆధిపత్యం కోసం ఇరువురు నేతలు కొట్టుకుంటున్నారని..పార్టీని భ్రష్టు పటిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
ఇదే అదునుగా భావించిన శశికళ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటునట్టు ప్రకటించిన ఆమె.. ఇప్పుడు మనస్సు మార్చుకున్నారు. పార్టీ అంతర్గత కలహాల తోనే ఎన్నికల్లో ఓటమి పాలైందని.. పళనిస్వామి -పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య ఆధిప్యత పోరు కొంపముంచిందని అంటున్నారు.
దీంతో మళ్లీ లైన్లోకి వచ్చేశారు. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి నాయకత్వంపై నమ్మకం లేని నేతలు శశికళ వైపు మొగ్గు చూపనున్నట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు ఈ ఏడాది చివరినాటికి ముగించాల్సి ఉంది. అందుకే ఈలోపు పార్టీని తన గ్రిప్ లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు చిన్నమ్మ.
ఇవి కూడా చదవండి: Crocodile: 13 అడుగుల భారీ మొసలిని పట్టుకున్న వేటగాడు.. కడుపులో 5 వేల ఏళ్లనాటి బాణం..