లక్నో, అక్టోబర్ 14: సాధారణంగా దసరా రోజు లోకానికి కీడు చేసిన రావణాసురుడి బొమ్మను దహనం చేస్తుంటారు. దసరా చివరి రోజున దేశ వ్యాప్తంగా రావణ దహనం పరిపాటి. అయితే ఓ మహిళ మాత్రం రావణాసుడికి బదులు అత్తామామలు, కట్టుకున్న మొగుడి దిష్టి బొమ్మలు దహనం చేసింది. దసరా రోజున వారి దిష్టి బొమ్మలను వారి ఇంటి ముందు దహనం చేసింది. పైగా ఈ ముగ్గరినీ సామాజిక రావణాసురులుగా సదరు మహిళ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో దసరా రోజున రావణుడి బదులు ప్రియాంక అనే మహిళ తన భర్త, అత్త, మామ, బావ, కోడలు దిష్టిబొమ్మలను దహనం చేసింది. నిజానికి ప్రియాంకకు ప్రియాంక 14 ఏళ్ల క్రితం సంజీవ్ దీక్షిత్‌తో వివాహం జరిగింది. పెళ్లికి ముందే తన సోదరి స్నేహితురాలు పుష్పాంజలితో తన భర్తకు అక్రమ సంబంధం ఉందన్న విషయం ఆ తర్వాత బయటపడింది. దీంతో వివాహం అయిన వెంటనే సంజీవ్ ప్రియాంకను విడిచిపెట్టి పుష్పాంజలితో కలిసి జీవించడం ప్రారంభించాడు. ఇదేందని ప్రియాంక ప్రశ్నించడంతో అత్త, మామ, ఆడపడుచు, ఆమె భర్త .. వీరంతా ప్రియాంకపై దాడికి తెగబడ్డారు. తప్పు చేస్తున్న దీక్షిత్‌ను దండించవల్సింది పోయి వారంతా అతడికి మద్దతు పలకడంతో ప్రియాంక ఆశ్చర్యపోయింది. దీంతో గత 14 సంవత్సరాలుగా వారితో ఆమె పోరాడుతూనే ఉంది. దీంతో దసరా నాడు ప్రియాంక తన భర్త ఇంటి ముందు భర్తతోపాటు అత్తింటిలోని అందరి దిష్టిబొమ్మలను దహనం చేసింది. వీరంతా రావణుడి వంటి వారిని తిరస్కరించాలని, వీరిని కూడా ఇదే పద్ధతిలో కాల్చివేయాలని చెబుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది.
తనకు న్యాయం చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆమె విజ్ఞప్తి చేసింది. ‘బేటీ బచావో, బేటీ పడావో’ విఫలమైనప్పటికీ, చదువుకున్న మహిళగా తాను ఇప్పటికీ రక్షణ కోరుతూనే ఉన్నానని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని, భర్త, అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.