షియోపూర్, డిసెంబర్ 26: మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో అర్ధరాత్రి చిరుతపులి సంచారం కలకలం రేపింది. రాత్రిపూట వీధుల్లో సంచరిస్తున్న చిరుత వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో షియోపూర్ రోడ్‌లపై పెద్ద పులి నడుస్తూ ఉండటం చూడొచ్చు. దీని వెనుక కారులో ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీశాడు.
రహదారిపై కనిపించిన చిరుత కునో నేషనల్ పార్క్ అధికారులు వదిలిన ‘అగ్ని’గా గుర్తించారు. చిరుత దారితప్పడంతో నగరానికి వచ్చి చేరుకుందని అధికారులు చెబుతున్నారు. చిరుత అమరల్ నది ఒడ్డు మీదుగా నగరంలోకి చేరుకోవడంపై స్థానికులు భయప్రాంతాలకు అవుతున్నారు. మంగళవార, బుధవారం మధ్య రాత్రి నగరంలోని నివాస ప్రాంతంలో సంచరిస్తూ కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చిరుత రాత్రి స్టేడియం వద్దకు చేరుకుందని, దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారని క్రషర్ కాలనీకి చెందిన తమన్నా ఖాన్ అనే మహిళ మీడియాకు తెలిపింది. చిరుత చాలా దూరం రోడ్లపై నడిచిన తర్వాత ఆహారం కోసం వీధి కుక్కను వేటాడిందని మరో నివాసి గిర్‌రాజ్ తెలిపారు.
చిరుత సంచారంపై షియోపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ విజ్ఞప్తి చేసింది. పొలాల్లోకి, అడవుల్లోకి వెళ్లవద్దని, అనవసరంగా బయట తిరగవద్దని ప్రజలకు హెచ్చరించారు. కాగా జాతీయ ఉద్యానవనం నుండి కునో చిరుతపులులు బయటకు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కొన్ని చిరుతలు ఇలాగే జనావాసాల్లోకి వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. చిరుతపులి సంచారంపై అటవీశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
కునో ఫారెస్ట్ డివిజన్ అధికారులు కునో నేషనల్ పార్క్‌లోని ఓపెన్ ఫారెస్ట్‌లో అగ్ని, వాయు అనే రెండు చిరుతలను విడిచిపెట్టారు. దీంతో ఈ రెండు పులులు కునో రిజర్వ్ జోన్ నుంచి వేర్వేరు దిశల్లో వెళ్లిపోయాయి. అనంతరం అవి కంచె నుంచి తప్పించుకున్నాయి. అవి మళ్లీ తిరిగి వస్తారని కునో నేషనల్ పార్క్ అధికారులు భావించారు. కానీ మంగళవారం-బుధవారం మధ్య రాత్రి వీర్ సావర్కర్ స్టేడియం సమీపంలో సంచరించిన వాయు.. బుధవారం ఉదయం నాటికి బేలా భీమ్లాట్ గ్రామ సమీపంలో కనిపించింది. అనంతరం అదే రోజు మధ్యాహ్నం కునో నేషనల్ పార్క్ సమీపంలోని భేలా భీమ్లా గ్రామానికి చేరుకుంది. నాలుగు రోజుల క్రితం కునో నేషనల్ పార్క్ నుంచి బయలుదేరి పట్టణ ప్రాంతానికి చేరుకున్న చిరుత వాయు ఇలా పలుమార్లు పలు చోట్ల కనిపించడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.