బీహార్, సెప్టెంబర్ 11: జీవితంలో ఎదురయ్యే అవాంతరాలు, అడ్డంకులను కొందరు అలవోకగా దాటి ముందుకెళ్తుంటారు. మరికొందరికి ఆ నేర్పు ఓర్పు ఉండదు. ఏదీ అనుకున్నదే తడవుగా అయిపోదు. దేనికైనా సరైన సమయం రావాలి. దీంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నిండు ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు కొందరు యువత. అలాంటి ఘటనే తాజాగా బీహార్‌లోని మోతిహారిలో చోటు చేసుకుంది. జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి చనిపోవాలని నిర్ణయించుకుంది. అంతే.. నేరుగా రైలు పట్టాల వద్దకు చేరుకుంది. చనిపోవాలనైతే నిర్ణయించుకుంది గానీ.. ఎంతకూ చావు రావట్లేదు. అదేనండీ.. రైలు పట్టాలపైకి రాలేదు. దీంతో చాలా సేపు ఎదురు చూసింది సదరు యువతి. పాపం చివరికి.. నిద్ర ముంచుకొచ్చినట్లుంది. ఎలాగూ అక్కడే చావాలనుకుంది కాబట్టి.. నిద్రపోయినా, మేల్కొని ఉన్నా పెద్ద తేడా ఏముందిలే? అని అనుకుందేమో.. పట్టాలపై అలాగే పడుకుని ఓ కునుకేసింది. మాంచి నిద్రలో ఉండగా.. ఓ రైలు అటుగా వచ్చింది. రైలులోని లోకో పైలట్ పట్టాలపై ఎవరో పడి ఉండటాన్ని గమనించాడు. అల్లంత దూరాన్నే బ్రేక్ వేశాడు. కానీ.. రైలు సరిగ్గా వచ్చి యువతికి కేవలం అరడుగు దూరంలో ఆగింది.
అనంతరం రైలు దిగొచ్చి యువతి చెయ్యి పట్టి లాగాడు. అప్పుడు మెలకువ వచ్చింది సదరు యువతికి. తలపైకి వచ్చి రైలు ఆగినా.. చుట్టూ కొలాహలంగా ఉన్న నిద్రలోనే ఉండిపోయింది. లేచి కూర్చుని.. ఎదురుగా నిలిచిపోయిన రైలు, చుట్టూ జనాన్ని చూసి బిత్తరపోయింది. మోతిహారి నుంచి ముజఫర్‌పూర్‌కు వెళ్తున్న రైలు అది. సకాలంలో లోకో పైలట్ సూసైడ్‌కు ప్రయత్నించిన యువతిని గమనించి బ్రేకులు వేసి, ఆమె ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A girl reached Motihari’s Chakia railway station to commit su!cide and fell asleep on the railway track while waiting for the train, Train Driver saved the girl’s life by applying emergency brakes, Bihar
pic.twitter.com/Jrg1VqjG2s— Ghar Ke Kalesh (@gharkekalesh) September 10, 2024
వీడియోలో వైట్ కలర్ దుస్తులు ధరించి, బ్యాక్‌ప్యాక్‌తో ఉన్న మహిళ ట్రాక్‌పై పడుకుని కనిపించింది. రైలు తనను ఢీకొట్టే వరకు వేచిచూస్తుండగా నిద్రలోకి జారుకున్నట్లు యువతి తెలిపింది. లోకో పైలట్, స్థానికులు ఆమెను పట్టాలపై నుంచి పక్కకు లాగేందుకు యత్నించగా.. ‘నేను చనిపోవాలనుకుంటున్నాను. నన్ను వదిలివేయండి. మీకు నాతో ఏంటి ప్రాబ్లెం?’ అంటూ వాళ్లతో వాదించసాగింది. ఇంతలో ఓ మహిళ వచ్చి ఆమెను దాదాపు కొట్టినంత పనిచేసింది. దీంతో యువతి ఏడుపు లంకించుకుంది. అందిన సమాచారం మేరకు ఆమె ఓ విద్యార్థి అని, తన కుటుంబంలో సమస్యల కారణంగా చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ గందర గోళంలో రైలు రాకపోకలకు కొద్ది సేపు అంతరాయం కలిగింది. అనంతరం ప్రయాణికులు రైలు ఎక్కడంతో రైలు ముందుకు సాగింది.