గయా, ఆగస్టు 21: నిండా ఏడాది వయసు కూడాలేని ఓ బుడ్డొడు ఏకంగా పామును చంపాడు. ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి వద్దకు వచ్చిన పామును ఆట వస్తువుగా భావించి.. నోట్లో పెట్టుకుని కసపిస నమిలాడు. దీంతో పిల్లాడి చేతుల్లోనే పాము చచ్చిపోయింది. ఇంత జరిగినా.. పాము పిల్లాడిని కరవక పోవడం కొసమెరుపు. పిల్లాడి నోటి నుంచి రక్తం రావడం.. పక్కన చచ్చి పడి ఉన్న పామును చూసిన తల్లి.. భయంతో ఆసుపత్రికి పరుగులు తీసింది. చిన్నారిని పరిశీలించిన వైద్యులు.. ఆరోగ్య పరిస్థితి చూసి మరింత ఆశ్చర్యపోయారు. ఈ విచిత్ర ఘటన బీహార్‌లోని గయాలో శనివారం (ఆగస్టు 17) చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
బీహార్‌లోని గయలోని ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జముహర్ గ్రామంలో ఏడాది వయసున్న చిన్నారి తన ఇంటి టెర్రస్‌పై ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలో అటుగా మూడు అడుగుల పొడవున్న ఓ పాము వచ్చింది. పామును బొమ్మగా భావించి.. దానిని పట్టుకుని కొద్ది సేపు ఆడుకున్నాడు. అనంతరం చిన్నారి పాము మధ్య భాగాన్ని నోట్లో పెట్టుకుని నమలడం ప్రారంభించాడు. దీంతో పిల్లాడి నోట్లోని పంటి గాట్ల వల్ల పాము చనిపోయింది. ఇంతలో అక్కడి వచ్చిన చిన్నారి తల్లి అక్కడి దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
Bihar: Child killed a snake by biting it, family members immediately took the child to a doctor for treatment. Where doctors declared the child healthy🫡
pic.twitter.com/3reJDCKQGD— Ghar Ke Kalesh (@gharkekalesh) August 20, 2024
చనిపోయిన పామును చూసి, దాన్ని బయటపడేసి.. చిన్నారిని ఎత్తుకుని పరుగు పరుగున స్థానిక ఆసుపత్రికి తరలించి జరిగిన విషయాన్ని వారికి వివరించారు. ఆసుపత్రి అధికారులు చిన్నారికి అన్ని రకాల పరీక్షలు చేసి మరింత షాక్‌కు గురయ్యారు. పిల్లవాడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని, ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. చిన్నారి కొరకడం వల్లనే పాము మృతి చెందిందని, చనిపోయిన పాము విషం లేనిదని, అది కాటు వేసినా ప్రమాదం ఉండదని చెప్పారు. ఇది ఎక్కువగా వర్షాకాలంలో కనిపిస్తుందని ఆసుపత్రి అధికారులు తెలిపారు.