దేశ రాజకీయాల్లో తమిళనాడు పాలిటిక్స్ వేరు. అక్కడంతా తమిళవాదం, ద్రవిడ భావజాలం, భాషాభిమానం అన్నీ కలగలిపిన రాజకీయం నడుస్తుంటుంది. దీంతో జాతీయ పార్టీలకు అక్కడ పెద్దగా స్కోప్ ఉండదు. ఒకవేళ ఉన్నా.. ఒకటి రెండు సీట్లకు పరిమితం అవుతుంటాయి. అందుకే ప్రాంతీయ పార్టీలు ఇబ్బడి మబ్బడిగా పుట్టుకొస్తుంటాయి. తమిళనాడులో ఎప్పటినుంచో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే పోటీ నడుస్తూ వస్తోంది. మరే పార్టీ అయినా.. ఈ రెండింటిలో ఒకదానికి మద్దతు పలకాల్సిందే. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమిళ సినీతారలు ఎవరి వ్యూహాల్లో వారు పడ్డారు. మక్కల్ నీది మయ్యం అనే పార్టీ పెట్టి.. పెద్దగా ప్రభావం చూపని కమల్ హాసన్.. డీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తామన్న మాటిచ్చారు. దీంతో డీఎంకే అధినేత స్టాలిన్ MNMకు ఒక రాజ్యసభ సీటును హామి ఇచ్చారు.
మరో నటుడు శరత్‌కుమార్ కూడా ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన AISMK(All India Samathuva Makkal Katchi)పార్టీని బీజేపీలో కలిపిన నటుడు శరత్‌కుమార్… బీజేపీపై గంపెడాశలతో ఉన్నారు. పార్టీని విలీనం చేసే సమయంలోనే కేంద్ర నాయకత్వం ఆయనకు మంచి పదవే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నటుడు శరత్‌కుమార్‌కు జాతీయ స్థాయిలో ఉన్నత పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారు. దీంతో ఆయనకు ఈసారి పార్లమెంటు సీటుకాని.. రాజ్యసభ సీటు కానీ ఇచ్చే అవకాశం ఉంది. నాడార్ సామాజిక వర్గానికి చెందిన శరత్‌కుమార్‌ను పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంచాలని బీజేపీ ఆలోచిస్తోంది. లేకుంటే శరత్‌కుమార్ భార్య.. సీనియర్ నటి రాధికకు పెద్దల సభకు ఎంపిక చేసే అవకాశాలున్నాయి.
ఇటీవల మరణించిన నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్ పార్టీ కూడా బీజేపీతో పొత్తుల కోసం చూస్తోంది. విజయకాంత్ మరణించిన సమయంలో ప్రధాని మోదీ స్పందించడం.. ఆ సమయంలో చెన్నైకి వచ్చిన సమయంలో విజయ్‌కాంత్‌కు నివాళులర్పించడం చేశారు మోదీ. దీంతో ఆయన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఒక రాజ్యసభ సీటును అడగాలని చూస్తోంది. ఇప్పటికే బీజేపీ ముందు.. 8 పార్లమెంట స్థానాలు, ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని చర్చలు జరిపారు. దివంగత నేత విజయ్‌కాంత్ మరణంతో ప్రజల్లో ఉన్న సానుభూతి పరంగా తమకు ఎక్కువ పార్లమెంట్ సీట్లు కావాలని అన్నాడీఎంకేతో అయినా సరే.. బీజేపీతో అయినా సరే పార్లమెంటు స్థానాలతో పాటు కచ్చితంగా రాజ్యసభ సీటు ఇచ్చేవారితోనే పొత్తులు పెట్టుకోవాలని డీఎండీకే నిర్ణయం తీసుకుంది. ఇలా సినిమా స్టార్లు, వారి పార్టీలు తమ కెరీర్‌ను సెట్ చేసుకునే పనిలో పడ్డాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.