Uttar Pradesh: రైలులో మత ప్రార్థనలు.. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. అసలు విషయం ఏమిటంటే..

బహిరంగ ప్రదేశాల్లో అనుమతులు లేకుండా మత ప్రార్థనలు నిర్వహించడం నిషేధం. ప్రార్థనాలయాలు లేదా అనుమతి పొందిన ప్రదేశాల్లో మాత్రం మత ప్రార్థనలు నిర్వహించుకోవచ్చు. ఇటీవల కాలంలో ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ లో..

Uttar Pradesh: రైలులో మత ప్రార్థనలు.. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. అసలు విషయం ఏమిటంటే..
Namaz In Train, Up

Updated on: Oct 23, 2022 | 5:00 PM

బహిరంగ ప్రదేశాల్లో అనుమతులు లేకుండా మత ప్రార్థనలు నిర్వహించడం నిషేధం. ప్రార్థనాలయాలు లేదా అనుమతి పొందిన ప్రదేశాల్లో మాత్రం మత ప్రార్థనలు నిర్వహించుకోవచ్చు. ఇటీవల కాలంలో ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ లో మత ప్రార్థనలు చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఒక రైలు బోగిలో నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. దీనిపై దర్యాప్తు వేగవంతం చేశామని ఉత్తరప్రదేశ్ పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌ రైల్వేస్టేషన్ లో ఉన్న రైలు బోగిలో నమాజ్ చేస్తున్న వీడియో ఒకటి లీక్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదంపై పోలీసులు స్పందించారు. ఈ వీడియోను ఖుషీనగర్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే దీప్లాల్ భారతి షేర్ చేశారు. స్లీపర్ కోచ్ మధ్యలో ముస్లిం యువకులు నమాజ్ చేస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్ ఖద్దా రైల్వే స్టేషన్‌లో ఆగినప్పుడు ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. నమాజ్ చేస్తున్న వారి పక్కన ఉన్న ఒక వ్యక్తి ప్రయాణికులను అవి పూర్తయ్యే వరకు వేచి ఉండాలని కోరడం వీడియోలో కనిపిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది. అలా పబ్లిక్ ప్లేస్ లలో చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యంగా ఉంటుందని కొన్ని హైందవ సంస్థలు విమర్శిస్తున్నాయి.

ఈ ఏడాది ప్రారంభంలో హర్యానాలో బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేస్తుండగా నిరసనలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో ముస్లింలు నమాజ్ చేయడంతో హైందవ సంస్థలకు చెందిన మద్దతుదారులు గుమిగూడి జై శ్రీరామ్ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చర్యలు చేపట్టారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గత నెలలో ఒక మహిళ ఆసుపత్రిలో నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఆమె కుటుంబ సభ్యుడు కోలుకోవాలని ప్రార్థన చేశారని, ఇతరులకు ఎలాంటి అంతరాయం కలిగించలేదని పోలీసులు తెలిపారు. ఆమె చర్య ఏ నేరం కిందకు రాదని పోలీసులు ప్రకటించారు.

ఈ ఏడాది జులైలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఒక మాల్‌లో కొంతమంది వ్యక్తులు నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో ఆ సందర్భంగా అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసులను ఆదేశించారు. ముందుగా పోలీసులు లేదా సంబంధిత అధికారుల అనుమతి లేకుండా తమ రాష్ట్రంలో ఎటువంటి మతపరమైన ర్యాలీలు చేపట్టవద్దని, లౌడ్ స్పీకర్లు పెట్టి ఇతరులకు అసౌకర్యం కల్పించవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..