VP Election India: భారత్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది.. అర్హులు ఎవరు? పూర్తి వివరాలివే..

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభాపతి జగదీప్ ధన్‌ఖర్ సోమవారం అర్ధరాత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలు రాజీనామాకు దారి తీశాయి. ఆయన ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. అందులో ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. 2025 వర్షాకాల సమావేశాల మొదటి రోజునే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు రాజ్యసభకు కొత్త సభాపతి ఎవరు? సభ కార్యకలాపాలు ఎలా కొనసాగుతాయి? ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది? భారత రాజ్యాంగంలో ఈ ఎన్నికకు సంబంధించిన నిబంధనలు ఏమిటి? ఈ వివరాలు తెలుసుకుందాం..

VP Election India: భారత్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది.. అర్హులు ఎవరు? పూర్తి వివరాలివే..
Vice President Election Process India

Updated on: Jul 22, 2025 | 8:15 PM

ఉపరాష్ట్రపతి ఎన్నికలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు మాత్రమే పాల్గొంటారు. నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కాకుండా అన్ని రాష్ట్రాల శాసనసభల ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి పదవికి ఉండాల్సిన అర్హతలు, ఈ పదవికి పోటీ చేసే విధానం వంటి విషయాల గురించి తెలుసుకుందాం..

భారత పౌరుడై ఉండాలి.

వయసు 35 ఏళ్లు దాటి ఉండాలి.

రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక అవ్వడానికి అవసరమైన అన్ని అర్హతలు కలిగి ఉండాలి.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి రూ.15 వేల రూపాయలు డిపాజిట్‌గా చెల్లించాలి. ఎన్నికలో ఓడిపోతే, లేదా కనీస ఓట్లు రాకుంటే ఈ మొత్తం తిరిగి రాదు.

ఎన్నికల ప్రక్రియ

ఉపరాష్ట్రపతి కావాలంటే, అభ్యర్థి కనీసం 20 మంది ఎంపీల మద్దతు, మరో 20 మంది ఎంపీల ఆమోదం చూపాలి. ఆ వ్యక్తి ఏ సభలో సభ్యుడు కాకూడదు. ఒకవేళ సభలో సభ్యుడు అయితే, రాజీనామా చేయాలి.

ఓటింగ్ పద్ధతి

ఉపరాష్ట్రపతి ఎన్నికలో లోక్‌సభ, రాజ్యసభల ఎంపీలు పాల్గొంటారు. రాజ్యసభలోని 245 మంది సభ్యులు, లోక్‌సభలోని 543 మంది సభ్యులు ఇందులో భాగం అవుతారు. రాజ్యసభలోని 12 మంది నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఒక ప్రత్యేక పద్ధతిలో జరుగుతుంది. దీనికి ‘అనుపాత ప్రాతినిధ్య పద్ధతి’ వర్తిస్తుంది. దీనిని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అని కూడా అంటారు. ఓటింగ్ సమయంలో ప్రతి ఒక్కరు ఒకే ఓటు వేయాలి, కానీ తమ ప్రాధాన్యతను తెలపాలి. బ్యాలెట్ పేపర్‌పై తమ మొదటి ప్రాధాన్యతను 1 నంబర్, ఆ తర్వాత 2 నంబర్ ఇలా ప్రాధాన్యతను గుర్తించాలి.

ఓట్ల లెక్కింపు ఎలా?

ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఇందులో కోటా నిర్ణయిస్తారు. సమాచారం ప్రకారం, ఓటు వేసిన సభ్యుల సంఖ్యను రెండుగా విభజిస్తారు. ఆ తర్వాత దానికి 1 కలుపుతారు. ఉదాహరణకు, ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలో 798 మంది ఎంపీలు ఓటు వేశారు అనుకుందాం. దీన్ని 2 తో భాగించండి: 399. ఇప్పుడు దీనికి 1 కలుపితే 400 వస్తుంది. ఎన్నిక గెలవాలంటే ఒక అభ్యర్థికి 394 ఓట్లు రావడం తప్పనిసరి. ఓటింగ్ తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందులో మొదటి ప్రాధాన్యత అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూస్తారు. అతనికి నిర్ణీత ఓట్లకు సమానంగా, లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు వస్తే, అతన్ని విజేతగా ప్రకటిస్తారు.

ఫలితం రాకుంటే ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. అప్పుడు అతి తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని ఎన్నిక పోటీ నుండి తొలగిస్తారు. కానీ అతనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ఓట్లలో, రెండవ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారో చూస్తారు. ఆ తర్వాత రెండవ ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్థుల ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ ఓట్లను బదిలీ చేసిన తర్వాత ఒక అభ్యర్థి ఓట్లు కోటా సంఖ్యకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ అయితే, ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఒక అభ్యర్థికి కోటాకు సమానమైన ఓట్లు వచ్చేవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.