ఉత్తరాఖండ్, నవంబర్ 27: ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ ప్రమాదం జరిగి నేటికి 15 రోజులు. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మకులను రక్షించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రిల్లింగ్ సమయంలో ఆగర్ యంత్రం విచ్ఛిన్నమైన సంగతి తెలిసిందే. దీంతో ఒకేసారి రెండురకాల పనులను ఆదివారం ప్రారంభించారు. నిలువుగా డ్రిల్లింగ్ చేసి లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీయాలనేది మొదటి ప్రణాళిక. రెండవ ప్రణాళిక మ్యానువల్ డ్రిల్లింగ్ చేయడం. ముక్కలైన భాగాలు పూర్తిగా బయటకు వచ్చేస్తే సిబ్బంది ద్వారా 10-12 మీటర్ల మేర తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. స్టీలు గొట్టం నుంచి వెళ్లి ఒకరు తవ్వుతుంటే మరొకరు ఆ వ్యర్థాలను బయటకు చేరవేయాలి. ఇది సమయం తీసుకునే ప్రక్రియ.
మరోవైపు ఆదివారం నుంచి కొండపై నుంచి నిలువు డ్రిల్లింగ్ పనులు ప్రారంభమయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన ఏజెన్సీలు నిలువుగా డ్రిల్లింగ్ చేసి సొరంగం లోపల నుంచి 41 మంది కూలీలను వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటి వరకు 19.2 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ పూర్తయింది. లోపల చిక్కుకున్న కార్మికులను చేరుకోవడానికి 86 నుంచి 87 మీటర్లు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన ఏజెన్సీలు 100 గంటల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అంటే నవంబర్ 30 నాటికి నిలువు డ్రిల్ పూర్తయ్యే అవకాశం ఉంది. డ్రిల్లింగ్ జరిగినంతమేర 700 మి.మీ. వెడల్పైన పైపుల్ని ప్రవేశపెడుతున్నారు. కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ టీమ్ పగలు రాత్రి శ్రమిస్తున్నారని ‘జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ’ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్) ఎండీ మహమూద్ అహ్మద్ చెబుతున్నారు.
VIDEO | Uttarkashi tunnel rescue UPDATE: "Six plans are being adopted in a synchronised manner. Operation wasn't put on halt and is still underway in terms of repair work," says Lt Gen (Retd) Syed Ata Hasnain, NDMA member on Uttarakhand tunnel rescue operation.… pic.twitter.com/ZNo6L8ZR5B
— Press Trust of India (@PTI_News) November 26, 2023
మరోవైపు ప్లాస్మా కట్టర్‌తో ఆగర్ మిషన్ బ్లేడ్‌లను కత్తిరించే పనులు కొనసాగుతున్నాయి. పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందనే దానికి సంబంధించి అధికారులు ఖచ్చితమైన సమయం చెప్పలేకపోతున్నారు. మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం భారత సైన్యం రంగంలోకి దిగింది. నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు భారత సైన్యం బాధ్యతలు స్వీకరించింది. మాన్యువల్ డ్రిల్లింగ్ పనిలో ఇండియన్ ఆర్మీ ఇంజనీర్లు సహాయం చేయనున్నారు. ఆర్మీ ఇంజనీరింగ్ రెజిమెంట్ మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ బృందం నిర్మాణంలో ఉన్న సొరంగం వద్దకు చేరుకుంది. మాన్యువల్ డ్రిల్లింగ్ పనులు ఆర్మీ బృందం చేపడుతోంది.
15 రోజులుగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో మాట్లాడేందుకు స్మార్ట్‌ఫోన్లు పంపించారు. అలాగే వారు ఆందోళన చెందకుండా ఉండేందుకు ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వీడియో గేమ్‌లు డౌన్‌లోడ్ చేసి పంపించారు. వీటిలో లూడో, స్నేక్ వంటి గేమ్స్ ఉన్నాయి. లోపల చిక్కుకున్న కార్మికులు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ గేమ్స్ ఆడే విధంగా ఏర్పాట్లు చేశారు. లోపల చిక్కుకున్న కార్మికులు మొదట్లో వాకీటాకీల ద్వారా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ కార్మికులు తమ కుటుంబాలతో ల్యాండ్‌లైన్ ఫోన్‌లతో మాట్లాడగలుగుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ నెల దీపావళి అమావాస్య నాడు సిల్‌క్యారా సొరంగం మధ్యలో 41 మంది కూలీలు చిక్కుకుపోయి సరిగ్గా రెండు వారాలు పూర్తయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.