
ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలోని తిలా మోడ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ముగ్గురూ అక్కాచెల్లెళ్ళు.. మంగళవారం (ఫిబ్రవరి 03) రాత్రి ఒకేసారి 9వ అంస్తు పైనుంచి దూకేశారు. అనుకోని శబ్దాలతో ఉలిక్కిపడ్డ జనం బయటకు వచ్చి చూసేసరికి.. నెత్తుటిమడుగులో కనిపించారు. పసి హృదయం ముక్కలైంది.. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ గుండె చెరువైంది. కొరియన్ లవ్ వలకు చిక్కి.. కన్నవాళ్లకు చెప్పుకోలేక.. బతకలేక.. నిస్సహాయంగా ప్రాణాలు వదిలేశారు. ఈ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మరణించిన సోదరీమణుల తండ్రి చేతన్‌కు ఇద్దరు భార్యలు. ఇద్దరూ కలిసి నివసిస్తున్నారు. వారు కూడా సొంత అక్కాచెల్లెళ్ళు కావడం విశేషం. ఒకరు ఇద్దరు కుమార్తెలకు జన్మనివ్వగా, మరొకరు ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. చేతన్ మొదటి వివాహం అతని కుటుంబ సభ్యుల సమ్మతితో జరిగింది. వివాహం తర్వాత, చేతన్ తన వదినను ప్రేమించి, ఆపై ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు.
ముగ్గురు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారని తండ్రి చేతన్ తెలిపారు. వారి గదిలో ఒక సూసైడ్ నోట్, డైరీ దొరికాయి, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చేతన్ తన ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలతో కలిసి భారత్ సిటీ సొసైటీలోని అద్దె ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం అక్కడికి వచ్చారు. మరో ఆశ్చర్యకరమైన సమాచారం ఏమిటంటే, COVID-19 మహమ్మారి నుండి ముగ్గురు కుమార్తెలు పాఠశాలకు వెళ్లడం లేదు. ముగ్గురూ ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లోనే ఉండటం వల్ల, వారు మొబైల్ గేమ్స్ ఆడటానికి బానిసలయ్యారు. అమ్మాయిలు కొరియన్ సంస్కృతి, కొరియన్ ఆటలకు బానిసలయ్యారు. వారి తండ్రి చేతన్ నిరాశతో వారి మొబైల్ ఫోన్‌లను లాక్కున్నాడు. దీంతో కోపంగా ఉన్న అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. దర్యాప్తులో ఇప్పటివరకు ఎటువంటి టాస్క్ బయటపడలేదు. అమ్మాయిల సూసైడ్ నోట్‌లో మొబైల్ ఫోన్ వల్ల కలత చెందినట్లు మాత్రమే ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
కొరియన్ లవ్ గేమ్ అంటే ఏమిటి..?
కొరియన్ లవ్ గేమ్ అనేది ఒక రకమైన ఆన్‌లైన్ చాట్‌గేమ్. ఇందులో అవతలి వ్యక్తి కొరియాకు చెందిన వారుగా పరిచయం చేసుకుంటారు. ముందుగా స్నేహం ఆ తర్వాత ప్రేమ పేరుతో మాటలు మొదలవుతాయి. ఆ తర్వాత క్లిష్టమైన పనులను చేయమంటారు. మానసిక ఒత్తిడి పెంచుతూ బెదిరింపులకి దిగుతారు. చెప్పినట్టు చేయకుండా ఇబ్బందులు పెడతామని వార్నింగ్ ఇస్తారు. దీని కారణంగా బాధితులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు.. అది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. బ్లూవేల్, పబ్‌జీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ, కొరియన్ లవ్.. పేరు ఏదైనా మ్యాటర్ మాత్రం ఆన్‌లైన్ ఆటలు.. చితికిపోయే బతుకులన్నమాట. ఘజియాబాద్‌లోనూ జరిగిందిదే..
భారత్ సిటిలో నివాసముండే చేతన్ కుమార్ దంపతుల గారాలపట్టీలు వీళ్లు. వీళ్ల మధ్య రెండేళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా ముగ్గురూ చిన్నప్పటికీ నుంచి ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. స్నానం, భోజనం, చదువు, నిద్ర.. ఇలా ఏ పనయినా కలిసే చేసేవాళ్లు. అమ్మకు పనుల్లో సాయం చేస్తూ.. చదువులో రాణిస్తూ.. నాన్న ప్రేమను గెల్చుకున్నారు. అంతా హ్యాపీస్ అనుకునేలోపే కరోనా ఎంట్రీతో కథ మరో వైపు టర్న్ అయింది. ఈ ముగ్గురు పిల్లలకు స్మార్ట్‌ఫోన్ వాడకం అలవాటుగా మారిపోయింది.
కొరియన్ టాస్క్ – బేస్డ్ ఆన్‌లైన్ గేమ్‌కి ఈ ముగ్గురు అడిక్ట్ అయిపోయారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు గేమ్‌లోనే మునిగిపోయేవాళ్లు. గేమ్ కోసం స్కూల్‌కెళ్లడం కూడా మానేశారు. చదువును నిర్లక్ష్యం చేయడం.. సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేయడాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఇదిలాగే కంటిన్యూ అయితే పిల్లల జీవితాలు నాశనం అవుతాయని భావించి.. కఠినంగా వ్యవహరించారు. గేమ్స్ ఆడటం మంచికాదని.. సెల్‌ఫోన్ లాక్కున్నారు. బడికెళ్లి బాగా చదువుకోవాలని మందలించారు. ఆ మాటలు తప్పుగా భావించారీ పిల్లలు. అమ్మానాన్న ఇక తమకు ఫోన్ ఇవ్వరని.. గేమ్స్ ఆడుకోనివ్వరని భావించారు. దీంతో చనిపోవాలని డిసైడ్ అయ్యారు. అర్దరాత్రి 2 గంటల సమయంలో 9వ అంతస్తుపైకి వెళ్లి ముగ్గురూ కిందకు దూకేశారు. పెద్ద శబ్దం రావడంతో సెక్యూరిటీ, స్థానికులు బయటకు వెళ్లి చూశారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అంబులెన్స్‌లో పిల్లల్ని హాస్పిటల్‌కి తరలించినా ఫలితం లేకుండాపోయింది. బాలికలు ముందుగా బాల్కనీ గ్లాస్‌పై కూర్చుని మాట్లాడుకున్నారని.. ఆ తర్వాత ఒకరి తర్వాత మరొకరు కిందకు దూకి చనిపోయారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
ఈ డైరీలో రాసినవన్నీ చదవండి.. ఇందులో ఉన్నవన్నీ నిజాలే. క్షమించు.. నాన్నా .. అంటూ మధ్యలో ఏడుస్తున్న ఏమోజీని బొమ్మ రూపంలో వేశారు. ఈ నోట్ అందరి గుండెల్ని పిండేసింది. “మేము కొరియన్ సంస్కృతిని ప్రేమిస్తున్నాము. మీరు మమ్మల్ని కొరియన్ సంస్కృతి నుండి దూరం చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మేము కొరియన్ సంస్కృతిని ఎంతగా ప్రేమిస్తున్నామో మీకు తెలుస్తుంది” అని ఉంది. హార్ట్ బ్రోకెన్, ఒంటరిదాన్ని అంటూ గోడలపై ఏవేవో కోట్స్ రాశారు. డైరీలోని 8 పేజీల్లో తాము కొరియాను ఎంత ఇష్టపడుతున్నామో వివరించారు. కొరియాను విడిచి ఉండలేమని.. కొరియానే తమ ప్రాణమని అందుకే ప్రాణాలు తీసుకుంటున్నామని రాసుకున్నారు. గేమ్‌లో ఆత్మహత్య ఉంటుందని తమకు తెలియదని.. తెలిస్తే పిల్లల్ని ఓ కంట కనిపెట్టేవాళ్లమని తల్లిదండ్రులు భోరున విలపించారు.
ఈ ముగ్గురూ కొరియన్ పాటలు, సినిమాలు, కార్టూన్లు, ఆటలు, యూట్యూబర్‌ల ద్వారా బాగా ప్రభావితమయ్యారని పోలీసులు తెలిపారు. ఆటల గురించి సమాచారం కూడా పొందారు. కానీ టాస్క్ ఆధారిత ఆటలు లేవు. ముగ్గురూ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆటలను మాత్రమే ఆడారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్య వెనుక రీజన్స్ ఏంటన్న దానిపై ఆరాతీస్తున్నారు. తల్లిదండ్రులు మందలించడంతోనే సూసైడ్ చేసుకున్నారా? ఆడుతున్న గేమ్‌లో టాస్క్‌లో భాగంగా పై నుంచి కిందకు దూకేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని గేమింగ్ హిస్టరీని విశ్లేషిస్తున్నారు.
ఇక మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఫ్రీ ఫైర్ గేమ్‌కి 13ఏళ్ల అన్ష్ బలైపోయాడు. స్కేటింగ్‌లో నాకు నేనే సాటి అంటూ.. ఏ టోర్నమెంట్‌లో పాల్గొ్న్నా కచ్చితంగా మెడల్ కొట్టేవాడు. చిన్నప్పటి నుంచి స్టడీస్‌లో చురుకు. ఆ గారభంతోనే అడిగినప్పుడల్లా బిడ్డ చేతికి సెల్‌ఫోన్ ఇచ్చారు పేరెంట్స్. అలా ఫ్రీ ఫైర్ గేమ్ బారినపడ్డాడు. అలా ఓసారి అకౌంట్ నుంచి 28 వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. పిల్లాడు ఎదో నొక్కాడులే అనుకున్నారు గానీ.. గేమ్ కారణంగానే ఇలా జరిగిందని అనుమానించ లేదు. అయితే అన్ష్ మాత్రం ఇంట్లో ఉన్నంత సేపు గేమ్‌తోనే కాలక్షేపం చేసేవాడు. అయితే ఆటలో భాగంగా అన్ష్ ఉరివేసుకుని చనిపోవడం కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చింది.
పిల్లలు చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని గట్టిగా అరుస్తుంటారు.. అటూ ఇటూ పరుగెత్తుతుంటారు.. ఏవేవో సంకేతాలు ఇస్తుంటారు. అదో లోకంలో మునిగిపోతుంటారు. అలాంటి వాళ్లను తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలంటున్నారు సైకాలజిస్ట్‌లు. ఖరీదైన ఫోన్లు ఇస్తున్నారే తప్ప.. వాళ్లు అందులో ఏం చేస్తున్నారనే విషయాన్ని పసిగట్టలేకపోతున్నారని అంటున్నారు. పిల్లలతో వాదులాడితేనో.. దెబ్బలాడితేనో మార్పు రాదని.. చేసేది తప్పని.. దానితో జరిగే నష్టం ఏంటో అర్ధమయ్యేలా చెబితే కొంత సమయం పట్టినా దారికొస్తారని అంటున్నారు. ఫైనల్‌గా పేరెంట్స్ ఎంత బిజీగా ఉన్నా.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచడం మాత్రం మరవొద్దని సూచిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..