లక్నో, సెప్టెంబర్ 14: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో నిత్య పెళ్లికూతురు చోరీకి పాల్పడింది. వివాహం జరిగిన 2 నెలల తర్వాత వధువు అత్తారింటికి వెళ్లాంది. ఆ తర్వాత అదును చూపి అత్తింట్లో బంగారు, వెండి ఆభరణాలతోపాటు దొరికినంత డబ్బు, బట్టలు తీసుకుని ఉడాయించింది. ఈ విషయం తెలుసుకున్న వరుడి తరపు బంధువులు నోరెళ్లబెట్టారు. దీంతో లబోదిబో మంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో సదరు యువతిపై ఫిర్యాదు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోని తప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘౌలీ గ్రామానికి చెందిన పుష్పేంద్ర అనే యువకుడు ఎలాంటి కట్నం తీసుకోకుండా హిందూ ఆచారాల ప్రకారం ఈ ఏడాది మే 16న ఢిల్లీకి చెందిన నేహా అనే యువతితో ఘనంగా వివాహం జరిగింది. వివాహానంతరం అత్తారింట్లో అడుగు పెట్టిన నేహా అదును చూసి డబ్బు, నగలతో పరారైంది. వియ్యంకుల వద్దకు వెళ్లి విచారించగా కట్నం కేసులో ఇరికిస్తామని బెదిరింపులకు దిగడంతో ఒక్కసారిగా వాళ్ల కాళ్ల కింద నేల కంపించి నట్లైంది. పెద్దలతో బాధిత యువకుడి తండ్రి పంచాయితీ నిర్వహించగా.. రాజీ పేరుతో వియ్యంకులు రూ.8 లక్షలు డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నేహాకు అప్పటికే రెండు పెళ్లిళ్లు అయినట్లు తెలిసింది. 2009లో అమిత్ అనే యువకుడితో బల్లభ్‌గఢ్‌లో ఆమె మొదటి వివాహం జరిగింది. మొదటి భర్త ఇంట్లో కూడా ఇలాగే రూ.4 లక్షలతో పరార్ అవడంతో పరువు పోతుందని భయపడిన అమిత్ పెళ్లిని రద్దు చేసుకున్నాడు. అనతరం బాగ్‌పత్‌కి చెందిన శక్తి అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకుని అక్కడి నుంచి కూడా దొరికిన కాడకు సర్దుకుని పరార్ అయ్యింది.
దీంతో మోసపోయామని గ్రహించిన బాధిత యువకుడి తండ్రి రవీంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూలై 16న తన కోడలు నేహా తమ ఇంట్లో రూ.56 వేల నగదుతోపాటు బంగారు, వెండి ఆభరణాలను అపహరించి పరారైనట్లు పోలీసులకు తెలిపాడు. తన కుమారుడు పుష్పేంద్రను నిందితురాలు నేహా వాస్తవాలు దాచి మోసం చేసి పెళ్లి చేసుకుందని రవీంద్ర ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు నేహా కోసం గాలింపు ప్రారంభించారు. నేహా ఆచూకీ కోసం ఓ స్పెషల్ టీం ను ఏర్పాటు చేశామని, త్వరలోనే నిందితురాలిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ ఎస్పీ రాజీవ్ ద్వివేది మీడియాకు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.