
మానవత్వం సిగ్గుపడే ఒక ఘటన మళ్ళీ ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో ఖుషీనగర్ జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రి వ్యవస్థలోని లోపాలను తెలియజేస్తూ.. మానవత్వం సిగ్గుపడే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడ ఆస్పత్రి అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం, యాజమాన్యం లోపభూయిష్ట నిర్ణయాల వలన రోడ్డు ప్రమాదంలో గాయపడిన రోగి ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో నేలపై పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అంతేకాదు.. గాయపడిన వ్యక్తి సమీపంలో కుక్క తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు రోగికి ఎమర్జెన్సీ చికిత్సనందించాల్సి ఉన్నా.. సమీపంలో ఒక్క వైద్య సిబ్బంది కూడా లేరని.. ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు.
వాస్తవానికి.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని నేలపై పడుకోబెట్టారు. అతని శరీరం రక్తస్రావం అవుతోంది. ఈ పేషెంట్ దగ్గర ఓ కుక్క తిరుగుతోంది. నేలపై పడి ఉన్న రోగి రక్తాన్ని కుక్క పీల్చుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో పనిచేసే వైద్యులు, నర్సులు రాత్రిపూట ఈ ఆస్పత్రిలో కనిపించరని.. ఈ ఆస్పత్రిలో ఆరోగ్య కార్యకర్తలకు బదులు కుక్కలు ప్రత్యక్షమవుతాయన్న ఆరోపణ కూడా ఉంది.
రోగి పరిస్థితి విషమం:
ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నేలపై పడుకుని ఉన్నాడు. నేలపై పడి ఉన్న రోగి రక్తాన్ని కుక్క పీల్చుతోంది. మీడియా నివేదికల ప్రకారం, నేలపై పడి ఉన్న వ్యక్తి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆసుపత్రి యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు
ఒకవైపు యూపీలోని యోగి ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య సేవలను మరింత ఆధునిక పద్ధతులతో ప్రజలకు అందించాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు బాధ్యతాయుతమైన అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ విశ్వసనీయతను పణంగా పెడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓపీడీ వేళలు ప్రారంభం కాగా, 11 గంటల వరకు కూడా వైద్యులు ఆస్పత్రి దగ్గరకు చేరుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది, ఉద్యోగులదీ అదే పరిస్థితి. ఇలాంటి అనేక ఘటనలు తెరపైకి తరచుగా వస్తున్నాయి. ఖుషీనగర్ జిల్లాలో కూడా వైద్య కళాశాల నిర్మాణం ప్రారంభమైంది.. దీంతో స్థానికులు మరింతగా ప్రజలకు ఆరోగ్య సౌకర్యం అందుతుందని ఆశించారు. అయితే ప్రస్తుతం జిల్లా ఆసుపత్రికి సంబంధించిన ఈ వీడియో వైరల్ కావడంలో మళ్ళీ సాధారణ ప్రజల మదిలో వైద్య చికిత్సపై మళ్ళీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ ఘటన నవంబర్ 1 తేదీ రాత్రి చోటు చేసుకున్నట్లు.. ఆ రోజున డాక్టర్ ఉజ్వల్ సింగ్ , ఫార్మసిస్ట్ అరవింద్ శర్మ డ్యూటీలో ఉన్నారని చెబుతున్నారు. బాధ్యులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని సీఎంఎస్ జిల్లా ఆసుపత్రి ఖుషినగర్ సతేంద్ర కుమార్ వర్మ తెలిపారు.
గమనిక- ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియో రోగి పరిస్థితి మనసుని కలవరపెట్టే విధంగా ఉంది. కనుక మేము ఆ వీడియోను పాఠకులను అందించలేకున్నాం..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..