అందుకు ఒప్పుకోలేదని ప్రియుడిని చంపి.. శవంపై నెయ్యి, వైన్ పోసి.. ఢిల్లీలో దారుణం

అతడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. ఓ యువతిని ప్రేమించి సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆ యువతి ప్రైవేట్ వీడియోలను తీసి హార్డ్ డిస్క్‌లో సేవ్ చేశాడు. ఆమె డిలిట్ చేయమని ఎంత మొత్తుకున్న వినలేదు. దీంతో ఆ యువతి ఓ కుట్రకు తెరదీసింది. అసలు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అందుకు ఒప్పుకోలేదని ప్రియుడిని చంపి.. శవంపై నెయ్యి, వైన్ పోసి.. ఢిల్లీలో దారుణం
Upsc Aspirant Murdered In Delhi

Updated on: Oct 28, 2025 | 7:56 AM

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన యూపీఎస్సీ అభ్యర్థి రామ్ కేశ్ మీనా హత్య కేసు చిక్కుముడి వీడింది. ఈ కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిమార్‌పూర్‌ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన రామ్‌‌ది సాధారణ మరణం కాదని.. అది పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని పోలీసులు తేల్చారు. మృతుడితో సహజీవనం చేసిన యువతే మరో ఇద్దరితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

అగ్నిప్రమాదం వెనుక కుట్ర

ఈనెల 6న తిమార్‌పుర్‌లోని ఓ భవనంలో పేలుడు సంభవించినట్లు సమాచారం అందింది. ఘటనా స్థలంలో కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడిని 32 ఏళ్ల రామ్‌కేశ్‌ మీనాగా గుర్తించారు. ఆయన సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. కీలక విషయాలు బయటపడ్డాయి. పేలుడుకు ముందు రోజు రాత్రి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు భవనంలోకి వెళ్లినట్లు కనిపించింది. కాసేపటి తర్వాత వారితో పాటు ఓ యువతి కూడా బయటకొచ్చింది. వీరు వెళ్లిపోయిన కాసేపటికే భవనంలో పేలుడు జరిగింది.

హత్యకు కారణం ఆ వీడియోలే

సీసీటీవీలో కనిపించిన ఆ యువతిని ఫోరెన్సిక్ సైన్సెస్ విద్యార్థిని అమృతా చౌహాన్‌‌గా గుర్తించారు. రామ్‌కేశ్‌తో ఆమె సహజీవనం చేస్తోంది. పోలీసులు అమృతను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఈ హత్యకు తానే సూత్రధారి అని అంగీకరించింది. రామ్‌కేశ్‌ మీనా, అమృత ప్రైవేటు వీడియోలను రికార్డు చేసి హార్డ్ డిస్క్‌లో భద్రపరిచాడు. వాటిని డిలీట్ చేయాలని అమృత ఎంతగా కోరినా రామ్‌కేశ్ నిరాకరించాడు. దీంతో అమృత తన మాజీ ప్రియుడు సుమిత్, మరో స్నేహితుడితో కలిసి అతడిని హత్య చేయడానికి ప్లాన్ వేసింది.

నిందితులు రామ్‌కేశ్‌ను చంపిన తర్వాత అది అగ్నిప్రమాదంలా కనిపించేందుకు భయంకరమైన కుట్రకు పాల్పడ్డారు. మృతదేహంపై నెయ్యి, నూనె, వైన్‌ చల్లి నిప్పంటించారు. వంట గదిలోని సిలిండర్ నుంచి గ్యాస్‌ లీక్‌ అయ్యేలా చేసి ఫ్లాట్‌కు తాళం వేసి పారిపోయారు. ఈ మొత్తం కుట్రను పక్కాగా అమలు చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు దారితీసిన హార్డ్ డిస్క్ సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.