UP Assembly Elections 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పొత్తులపై క్రమంగా క్లారిటీ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో రాష్ట్రీయ లోక్ దళ్(RLD) పొత్తు ఖరారయ్యింది. సమాజ్‌వాది పార్టీతో తమ పార్టీకి పొత్తు ఉంటుందని ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి అధికారిక ప్రకటన చేశారు. అయితే పొత్తులో భాగంగా తమ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించనున్నారన్న అంశాన్ని వెల్లడించలేదు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల్లో గెలిచి యూపీలో అధికారంలోకి వచ్చాక తాము చేయబోయే తొలి పని ఏంటో ప్రకటించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు విడిచిన రైతుల కోసం స్మారకాన్ని నిర్మించనున్నట్లు జయంత్ చౌదరి ప్రకటించారు.
యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చి- ఏప్రిల్ మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. యూపీతో పాటు పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో అధికార బీజేపీ, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఒంటరి పోరుకు మొగ్గుచూపుతున్నాయి. దీంతో అక్కడ చతుర్ముఖ పోరు ఖాయంగా తెలుస్తోంది. అటు ఎంఐఎం కూడా యూపీలో తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. కొన్ని నియోజవర్గాల్లో ఎంఐఎం గట్టి పోటీ ఇవ్వడంతో పాటు.. ఇతర పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయొచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
పెద్ద పార్టీలతో పొత్తు ఉండబోదని స్పష్టంచేసిన సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. అయితే చిన్న పార్టీలతో పొత్తులు ఉంటాయని గతంలో ప్రకటించారు. బీజేపీకి సమాజ్‌వాది పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముందని అంచనావేస్తున్నారు. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సమాజ్‌వాది పార్టీ పైచేయి సాధించింది.
Also Read..
Pushpa Movie: సోషల్ మీడియాలో తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న “పుష్ప” ట్రైలర్..