బెంగాల్ లో లవ్ జిహాద్ ని ప్రోత్సహిస్తున్నారని, ఆవుల స్మగ్లింగ్ జరుగుతోందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. రాష్ట్రంలో కొన్ని వర్గాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకునేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం వీటిని ఆపలేకపోతోందని ఆయన అన్నారు. ఒకప్పుడు దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిన పశ్చిమ బెంగాల్..లో ఇప్పుడు శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తమ రాష్ట్రంలో లవ్ జిహాద్ ని నిషేధిస్తూ చట్టం తెచ్చా మన్నారు. ఇక్కడ ఓటు బ్యాంకు కోసం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తహతహలాడుతోందని, ఇక్కడ అక్రమ శరణార్ధుల సంఖ్య పెరిగిపోతోందని ఆయన అన్నారు. బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన పక్షంలో కేవలం ఒక్క రోజులో ఆవుల స్మగ్లింగ్ కి అడ్డుకట్ట వేస్తామని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. మాల్దాలో మంగళవారం జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఆయన.. ఈ రాష్ట్రంలో జైశ్రీరామ్ నినాదాన్ని అనుమతించడం లేదన్నారు. మత పరమైన సెంటిమెంట్లతో ఆడుకుంటున్న ఈ తృణమూల్ ప్రభుత్వానికి ప్రజలు గట్టి సమాధానం ఇస్తారని ఆయన అన్నారు.
మే 2 న తాము ‘దీపోత్సవం ఆఫ్ నేషనలిజం’ వేడుకను నిర్వహిస్తామని ఆదిత్యనాథ్ తెలిపారు. అంటే 5 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీదే విజయమని పరోక్షంగా పేర్కొన్నారు. బెంగాల్ లో దుర్గా పూజను నిషేధించారని, ఈద్ సందర్భంగా గోవుల వధ జరుగుతున్నా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కాగా బెంగాల్ లో ఈయన కనీసం డజను ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని యోగి ఆదిత్యనాథ్ జోస్యం చెప్పారు. టీఎంసీ ప్రభుత్వం గద్దె దిగడాన్ని మీరు చూస్తారని కూడా ఆయన పేర్కొన్నారు. మాల్డా లో జరిగిన ర్యాలీకి పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు హాజరయ్యారు.
మరిన్ని చదవండి ఇక్కడ :
తేయాకు కార్మికురాలిగా మారిన కాంగ్రెస్ నేత ప్రియాంక వైరల్ అవుతున్న ఫొటోస్ : Congress Priyanka Photos.