Kishan Reddy: దేశ ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం.. బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్లకు భూమిపూజ చేయనున్న కిషన్ రెడ్డి..

భారతదేశ ఇంధన భద్రతలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. కేవలం బొగ్గును వెలికితీయడమే కాదు దాన్ని పర్యావరణ హితంగా మార్చి సరికొత్త శక్తిగా మలిచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నాగ్‌పూర్‌లో భవిష్యత్తు అవసరాల కోసం కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారు.

Kishan Reddy: దేశ ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం.. బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్లకు భూమిపూజ చేయనున్న కిషన్ రెడ్డి..
Union Minister Kishan Reddy Nagpur Visit

Updated on: Mar 13, 2026 | 9:24 PM

దేశీయ బొగ్గు వనరుల వినియోగాన్ని పెంచడం, పర్యావరణహిత ఇంధన ఉత్పత్తి దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నాగపూర్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి కిషన్ రెడ్డి చంద్రాపూర్‌లోని భద్రావతి ఇండస్ట్రియల్ ఏరియాలో రెండు కీలక కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లకు భూమి పూజ చేయనున్నారు. గ్రెటా ఎనర్జీ అండ్ మెటల్, న్యూ ఎరా క్లీన్‌టెక్ సొల్యూషన్ అనే రెండు ప్రైవేట్ సంస్థలు ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి.

వినూత్న ఉత్పత్తుల దిశగా

గ్రెటా ఎనర్జీ సంస్థ డైరెక్ట్ రిడ్యూస్డ్ ఐరన్ ఉత్పత్తి కోసం, న్యూ ఎరా క్లీన్‌టెక్ సంస్థ అమ్మోనియం నైట్రేట్, హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఈ గ్యాసిఫికేషన్ సాంకేతికతను ఉపయోగించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.8500 కోట్లతో ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహక పథకం కింద ఎంపికైన ఏడు ప్రాజెక్టులలో ఇవి కూడా ఉన్నాయి.

కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ – 2030

2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫికేషన్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. దీనివల్ల యూరియా, సహజ వాయువు, ఇథనాల్ మరియు కోకింగ్ బొగ్గు వంటి వాటి కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. కేవలం బొగ్గు తీయడమే కాకుండా, మైనింగ్ పూర్తయిన తర్వాత ఆ భూములను ఎలా పునరుద్ధరించాలనే అంశంపై కూడా కేంద్రమంత్రి దృష్టి పెట్టారు. ముర్పర్ మైన్ మూసివేత స్థలాన్ని సందర్శించి.. మైన్ మూసివేత సలహా కమిటీతో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు.

ఈ ప్రాజెక్టుల ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా దేశీయ ఇంధన భద్రత పెరుగుతుంది. బొగ్గును నేరుగా కాల్చకుండా గ్యాసిఫికేషన్ చేయడం వల్ల క్లీనర్ ఎనర్జీ లభిస్తుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మరియు పారిశ్రామిక వృద్ధికి పెద్ద ఊతం ఇవ్వనుంది.

Follow Us