Kishan Reddy: దేశం మేలు కోరే ప్రతిపక్ష నాయకుడు కావాలి: రాహుల్‌పై కిషన్ రెడ్డి ఫైర్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జి-7 సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన అవాస్తవ ప్రచారాలను తీవ్రంగా ఎండగట్టారు. కెనడా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా ఆహ్వానం పంపిన విషయాన్ని హైలెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు సమాచారం ప్రచారం చేయడం ద్వారా దేశ ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kishan Reddy: దేశం మేలు కోరే ప్రతిపక్ష నాయకుడు కావాలి: రాహుల్‌పై కిషన్ రెడ్డి ఫైర్
Union Coal Minister G Kishan Reddy

Updated on: Jun 07, 2025 | 6:02 PM

ప్రధాని నరేంద్ర మోదీ జి-7 సదస్సుకు ఆహ్వానించలేదంటూ అవాస్తవాలను కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కెనడాలో జరగనున్న జి-7 సదస్సుకు ప్రధానికి ఆహ్వానం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకుందన్నారు. అయితే కెనడా ప్రధాని మార్క్ జే కార్నీ… నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా ఆహ్వానించిన విషయాన్ని కిషన్ రెడ్డి హైలెట్ చేశారు. భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని.. వస్తువులు తయారీ, పంపిణీలో ఒక ముఖ్యమైన దేశం కాబట్టి జి-7 సదస్సులో పాల్గొనడం అవసరం అని కెనడా ప్రధాని పేర్కొన్నట్లు తన ట్వీట్‌లో ప్రస్తావించారు.

రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై ద్వేషంతో వ్యవహరించడమే కాకుండా, దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు ఎలా ప్రవర్తించాలన్న విషయంపై రాహుల్ గాంధీకి స్పష్టత లేక నకిలీ వార్తలను సర్కులేట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి మోడీ పట్ల ఆయనకున్న ద్వేషం.. దేశం పట్ల ద్వేషంగా మారిందన్నారు. భారత్ పురోగతి సాధించడం, అభివృద్ధి చెందడాన్ని రాహుల్ సహించలేకపోతున్నారని కిషన్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. దేశం పలు అంశాల్లో విఫలం అవ్వాలని ఆయన కోరుకుంటున్నట్లు ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలు ప్రచారం చేయడంలో మునిగిపోయిందన్నారు కిషన్ రెడ్డి. భారతదేశ ఎన్నికల ప్రక్రియ గురించి.. ఎలక్షన్ కమిషన్ పలు సార్లు క్లారిటీ ఇచ్చినా.. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను అణగదొక్కడానికి ప్రయత్నిస్తూ.. అవాస్తవాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. “దేశానికి… అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రతిపక్షం, ప్రతిపక్ష నాయకుడు కావాలి” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి