Amit Shah: ఆట మొదలుపెట్టిన అమిత్‌షా.. ఉత్కంఠ రేపుతోన్న తమిళనాడు పర్యటన!

తమిళ రాజకీయాలు.. ఎవరికీ అర్థంకాని బ్రహ్మపదార్థం. ఇక్కడ స్థానిక పార్టీలదే ఆధిపత్యం. అందుకే డీఎంకే, అన్నాడీఎంకే.. దశాబ్దాలుగా రాజ్యమేలుతున్నాయి. కానీ ఇప్పుడు, కమలం పార్టీ..అరవ గడ్డపై తన మార్క్ చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. సరికొత్త వ్యూహాలతో పొలిటికల్‌ గేమ్‌ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఏంటది?. అమిత్‌షా టూర్‌ వెనకున్న సీక్రెట్‌ ఏంటి?

Amit Shah: ఆట మొదలుపెట్టిన అమిత్‌షా.. ఉత్కంఠ రేపుతోన్న తమిళనాడు పర్యటన!
Amit Shah Tamil Nadu Tour

Updated on: Apr 11, 2025 | 10:06 AM

తమిళ రాజకీయాలు.. ఎవరికీ అర్థంకాని బ్రహ్మపదార్థం. ఇక్కడ స్థానిక పార్టీలదే ఆధిపత్యం. అందుకే డీఎంకే, అన్నాడీఎంకే.. దశాబ్దాలుగా రాజ్యమేలుతున్నాయి. కానీ ఇప్పుడు, కమలం పార్టీ..అరవ గడ్డపై తన మార్క్ చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. సరికొత్త వ్యూహాలతో పొలిటికల్‌ గేమ్‌ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఏంటది?. అమిత్‌షా టూర్‌ వెనకున్న సీక్రెట్‌ ఏంటి?

తమిళనాడుపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో చేసిన తప్పిదాలు చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఏడాదిలోపే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఇప్పట్నుంచే ఆట మొదలుపెట్టింది కాషాయదళం. తమిళనాట సత్తా చాటాలన్న పొలిటికల్‌ ప్లాన్‌తో అరవ దేశంలో అడుగుపెట్టారు బీజేపీ అగ్రనేత అమిత్‌షా. రాష్ట్ర పార్టీని సమర్ధంగా నడిపే యోధుడిని ఎంపిక చేయడంతోపాటు.. గెలుపు కోసం అవసరమైన రూట్‌మ్యాప్‌ని బ్లూప్రింట్‌ని అందజేయనున్నారు. అయితే, అమిత్‌షా ఎంట్రీతో.. ప్రత్యర్థుల గుండెల్లోనే కాదు.. తమిళనాడు కమలనాథుల మనసుల్లోనూ దడ మొదలైంది. ఎందుకంటే, రాష్ట్ర బీజేపీ చీఫ్‌ ఎవరవుతారనే టెన్షన్‌.. ఊపరిబిగపట్టేలా చేస్తోంది.

తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిపై ఢిల్లీ నుంచి ప్రకటన వస్తుందని భావించారంతా..!. కానీ, అందుకు భిన్నంగా కీలక ప్రకటన చేయడంతో రాష్ట్ర బీజేపీ చీఫ్‌ ఎన్నిక రసవత్తరంగా మారింది. అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే కనీసం పదేళ్లపాటు పార్టీ ప్రాథమిక సభ్యతం ఉండాలంటూ కండీషన్‌ పెట్టింది బీజేపీ. దాంతో, ఇప్పటివరకు రేస్‌లో ముందున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే నైనార్‌ నాగేంద్రన్‌.. పోటీపై సంక్లిష్టత ఏర్పడింది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేని విడిచి.. 2017 ఆగస్ట్‌లో బీజేపీ గూటికి చేరారు నాగేంద్రన్‌. ఈ లెక్కన చూస్తే.. పార్టీలో ఎనిమిదేళ్లు కూడా నిండలేదు నాగేంద్రన్‌కి. ఇక, మొన్నటివరకూ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైకి కూడా పదేళ్లు పూర్తికాలేదు. దాంతో, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికపై కమలనాథుల్లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మరోవైపు, తమిళనాడులో అమిత్‌షా చేస్తోన్న పర్యటన సాధారణ పార్టీ విజిట్‌ మాత్రం కాదు. కచ్చితంగా ఇదొక స్ట్రాటజిక్ మూవ్!. ఈ పర్యటన ప్రధాన అజెండా రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికే..!. కానీ, ఫ్యూచర్ ప్లాన్‌ కూడా దాగుంది. తమిళనాడు BJP ముఖ్య నేతలతో సమావేశంకానున్న అమిత్‌షా.. అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పొత్తులపై కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం నడుస్తోంది. రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా కొత్త ముఖాన్ని పరిచయం చేస్తారా? లేక రాజకీయ సంచలనాలకు తెరలేపుతారా అనే చర్చ జరుగుతోంది. అయితే, అమిత్‌షా పర్యటన మాత్రం.. తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని షేక్‌ చేయడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..