కేంద్రం సంచలన నిర్ణయం.. ఆరావళిలో కొండల్లో మైనింగ్‌ నిషేధం.. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు

Aravalli Hills: ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌ను కేంద్రం నిషేధించింది. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం పూర్తయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుంది. అరావళి ప్రాంతంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటం, అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్ర పర్యావరణ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్రం సంచలన నిర్ణయం.. ఆరావళిలో కొండల్లో మైనింగ్‌ నిషేధం.. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు
Union Govt Bans Mining In Aravalli Hills

Updated on: Dec 24, 2025 | 7:56 PM

దేశ రాజధాని ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు విస్తరించి ఉన్న అరావళి పర్వత శ్రేణులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌ను కేంద్రం నిషేధించింది. ఆరావళి ప్రాంతంలో ఎలాంటి కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయకూడదంటూ కేంద్ర పర్యావరణశాఖ సంబంధిత రాష్ట్రాలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. గతంలో రాష్ట్రాల వారీగా ఉన్న భిన్నమైన నిబంధనలకు స్వస్తి పలికి, ఇప్పుడు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న మొత్తం అరావళి భూభాగం అంతటా ఈ నిషేధాన్ని ఒకే విధంగా వర్తింపజేయాలని కేంద్రం స్పష్టం చేసింది. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి, ఈ పర్వత శ్రేణి యొక్క భౌగోళిక సమగ్రతను రక్షించడానికి ఈ అడుగు వేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అక్రమ మైనింగ్ కార్యకలాపాల వల్ల అరావళి కొండలు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లేదా పర్యావరణ అధ్యయనాలు పూర్తయ్యే వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త మైనింగ్ అనుమతులు ఇవ్వడానికి వీల్లేదు. గుజరాత్ నుండి ఢిల్లీ వరకు ఈ పర్వత శ్రేణిని ఒకే భౌగోళిక యూనిట్‌గా పరిగణించి రక్షణ చర్యలు చేపట్టనున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు అరావళి మైనింగ్‌పై తీవ్రంగా స్పందిస్తూ.. “కొండలు కనుమరుగైతే పర్యావరణానికి కోలుకోలేని నష్టం జరుగుతుంది” అని హెచ్చరించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే కేంద్ర మంత్రిత్వ శాఖ ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రాలకు ఈ ఆదేశాలు పంపింది.

రాజస్థాన్‌లోని థార్ ఎడారి తూర్పు వైపుకు విస్తరించకుండా అరావళి పర్వతాలు సహజమైన గోడలా అడ్డుకుంటున్నాయి. ఈ పర్వత శ్రేణులు భూగర్భ జలాల రీఛార్జ్ కేంద్రాలుగా పనిచేస్తాయి. మైనింగ్ వల్ల ఈ సహజ నీటి వనరులు దెబ్బతింటున్నాయి. అరావళి అడవులు ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతానికి ఊపిరితిత్తుల వంటివి. ఇవి కనుమరుగైతే రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం వేడి గాలులు మరింత తీవ్రమవుతాయి.అంతేకాకుండా చిరుతపులులు, నీల్గాయ్ వంటి అనేక వన్యప్రాణులకు ఇవి నిలయాలు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి