Old Vehicle: మీ వద్ద పాత కారుగానీ, పాత బైక్ గానీ ఉందా..? అయితే వాటిని వదిలించుకోండి. ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో ప్రకటించిన తుక్కు విధానం అమల్లోకి వస్తే ఈ వాహనాల వల్ల మీ జేబులకు చిల్లులు పడటం ఖాయమని తెలుస్తోంది. 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కావాలంటే ఇక నుంచి భారీగా చెల్లించాల్సి ఉంటుంది. వాణిజ్య వాహనాలైతే ఇప్పుడున్న ఫీజు కంటే 62 రేట్లు ఎక్కువ కానుంది. అదే వ్యక్తిగత వాహనమైతే 8 రేట్లు ఫీజు పెరగనుంది. ఇది కాకుండా రాష్ట్రాలు రోడ్ ట్యాక్స్‌కు అదనంగా గ్రీన్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తాయి.
కొత్త తుక్కు విధానాన్ని వచ్చే రెండు వారాల్లో రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ప్రకటించనుంది. మోటారు వాహన చట్టం ప్రకారం ఎనిమిదేళ్లు దాటిన వాహనాలకు ప్రతి యేటా ఫిట్‌నెట్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవడం మాత్రం తప్పనిసరి. దీనికి తోడు రాష్ట్రాలు వార్షిక రోడ్ ట్యాక్స్ 10 నుంచి 25 శాతం వరకు గ్రీన్ ట్యాక్స్ విధించవచ్చు. అయితే 15 సంవత్సరాలు దాటిన వ్యక్తిగత వాహనాల విషయానికొస్తే టూవీలర్ అయితే రిజిస్ట్రేషన్ చార్జ్ రూ.300 నుంచి రూ.1000 వరకు పెరగనుండగా, కార్లకు రూ.600 నుంచి రూ.5వేల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాహనాలపై రాష్ట్రాలు ఐదేళ్ల వరకు గ్రీన్ ట్యాక్స్ వేసుకోవచ్చు. ఈ తుక్కు విధానం గురించి ప్రజల్లో పెద్దగా అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. ఈ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఒక వాయిస్ మెసేజ్‌ను రూపొందించి ఓనర్లు, డ్రైవర్లకు మొబైల్ ఫోన్‌లలో పంపడంతో పాటు పెట్రోల్ పంపులు, డీలర్లు, సర్వీసు సెంటర్లలో ఎప్పుడు వినిపించేలా చర్యలు తీసుకుంటోంది.
Also Read:
Petrol, Diesel Price Today(03- 02- 2021): దేశంలో ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు