Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. వలస కూలీలను పొట్టనపెట్టుకుంటున్నారు. నిన్న ఇద్దరిని కాల్చి చంపిన ఉగ్రవాదులు.. ఇప్పటి వరకు వలస కార్మికులు సహా 11 మంది పౌరుల హత్య చేశారు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్(ULF) ప్రకటించుకుంది. వలస కూలీలు వెంటనే కశ్మీర్ వదిలి వెళ్లిపోవాలని తాజాగా విడుదల చేసిన ఓ లేఖలో యూఎల్‌ఎఫ్ హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ముస్లింలను హత్యలు చేస్తున్నారని, బీహార్ లో గడిచిన ఏడాది కాలంలో హిందూ అతివాదులు 200మందికి పైగా ముస్లింలను హత్య చేశారని, ముస్లింల హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆ లేఖలో పేర్కొంది. కాగా,పాకిస్తాన్ ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఆర్గనైజేషనే ఈ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్.
కాగా, కశ్మీర్‌లో పౌరుల హత్యలు కొనసాగుతున్న వేళ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను వేటాడటం ద్వారా వారి ప్రతి రక్తపు బొట్టుపై ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. జమ్మూ కాశ్మీర్ యొక్క శాంతి, సామాజిక-ఆర్థిక పురోగతికి, ప్రజల వ్యక్తిగత అభివృద్ధికి విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, జమ్మూకశ్మీర్ లో వేగవంతమైన అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నట్లు సిన్హా పునరుద్ఘాటించారు.
కాగా, ఆదివారం కూడా కశ్మీర్‌లోని కుల్గాంలో స్థానికేతర కూలీలే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఇది జమ్మూకశ్మీర్ లో 24 గంటల వ్యవధిలో కశ్మీరేతరులపై జరిగిన మూడో దాడి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం వాన్‌పోలో వలస కార్మికులు ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించిన ముష్కరులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వలస కూలీలు మరణించగా.. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.