ఏ దేశంలో ఉంటే ఆ దేశ సంస్కృతిని గౌరవించాలన్న సామెతను అచ్చుగుద్దినట్లు పాటిస్తున్నారు పలు దేశాల దౌత్యవేత్తలు. కొద్దిరోజుల క్రితం భారత్‌లో జర్మనీ అంబాసిడర్ పిలిఫ్ అదే చేశారు. తాను కొనుగోలు చేసిన ఓ ఎలక్ట్రిక్ కారుకు మిరపకాయలు, నిమ్మకాయలు కట్టి పూజలు చేయించారు. పూజల తర్వాత టైర్ల కింద పెట్టిన నిమ్మకాయల పైనుంచి వెళ్లారు. అంతేకాదు కారు లోపల సైతం నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి కొత్తకారుకు దిష్టి తీసుకున్నారు.
జర్మనీ అంబాసిడర్ కోవలోనే నడిచారు అమెరికా అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టీ. దీపావళి పర్వదినం సందర్భంగా భారతీయ వస్త్రధారణలో మెరిశారు. భారత ఎంబసీలో జరిగిన దీపావళి వేడుకల్లో చిన్నారులతో కలిస చిందేస్తూ ఉత్సాహంగా గడిపారు. స్టెప్పులతో అదరగొడుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. అమెరికా న్యూయార్క్ మేయర్ ఆఫీసులోనూ దీపావళి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు డిప్యూటీ కమిషనర్ హాజరై భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని వివరించారు.
ప్రెంచ్ ఆంబాసిడర్ మోతా దంపతులు సైతం దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమబెంగాల్‌లోని ఓ షాపుకు వెళ్లి స్వీట్లు కొనుగోలు చేశారు. పలువురి ఇంటికి ఆహ్వానించి స్వీట్లు తినిపించారు. అనంతరం ఇంట్లో దీపాలు వెలిగించి శుభాకాంక్షలు చెప్పారు.