
ఈ మధ్య విమానాల్లో అమానుష ఘటనలు పెరుగుతున్నాయి. ప్రయాణికులపై మలమూత్ర విసర్జన చేయడం, ఒకరికొకరు కొట్టుకోవడం లాంటివి జరుగుతున్నాయి. అయితే మరో ఘటన ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. బుధవారం రోజున దుబాయ్ నుంచి ముంబై వచ్చిన ఇండిగో విమానంలో ఇద్దరు ప్రయాణికులు తప్ప తాగి రచ్చ రచ్చ చేశారు. తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవరిస్తూ మద్యం మత్తులో రెచ్చిపోయారు. వీరి ఆగడాలను అడ్డుకనేందుకు విమాన సిబ్బంది యత్నించగా వారిని కూడా లెక్కచేయకుండా దుర్భాషలాడారు. మద్యం బాటిళ్లను వారి వద్ద నుంచి తీసేందుకు ప్రయత్నించగా గొడవకు దిగారు. ఈ ప్రయాణికులను దత్తాత్రేయ బపార్టేకర్, జాన్ జార్జ్ డిసౌజాగా సిబ్బంది గుర్తించారు. విరపై పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో విమానం ముంబయిలో ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. కానీ మళ్లీ ఆ తర్వాత వీరు బెయిల్ పై విడుదలైనట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఇద్దరు ప్రయాణికులు గల్ఫ్ దేశంలో ఏడాది కాలం పాటు పనిచేశారు. ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో మందుబాటిళ్లు కొనుగోలు చేసి విమానంలోనే పార్టీ చేసుకున్నారు. ఇబ్బందిగా ఉందని తోటి ప్రయాణికులు చెప్పడంతో వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఒక్కసారిగా విమానంలో గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే ఇలాంటి ఘటనలు విమానంలో జరగడం ఏడోసారి కావడం గమనార్హం. ఇటీవస లండన్-ముంబయి ఫ్లైట్లో సిగరెట్ తాగిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే జనవరిలో ఢిల్లీ నుంచి పాట్నా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం తాగి రెచ్చిపోయాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..