Agnipath Scheme: అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారులు చేస్తు్న్న ఆందోళనలతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళన చేస్తున్న వారు రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఫలితంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నిరసనలు ఇప్పటికీ తొలిగేలా కనిపించకపోవడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆందోళనల కారణంగా సోమవారం 500లకు పైగా రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అగ్నిపథ్ ఆందోళనలు 529 రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపించాయని రైల్వేశాఖ వెల్లడించింది. ఇవాళ రద్దయిన 529 రైళ్లలో 181 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉండగా 348 ప్యాసింజర్ రైళ్లు(Passenger Trains) ఉన్నాయి. రద్దయిన వాటిలో 71 రైళ్లు దేశ రాజధాని ఢిల్లీకి రాకపోకలు సాగించే ప్రయాణికులవే కావడం గమనార్హం. అగ్నిపథ్(Agnipath) పథకంపై తెలంగాణ, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు రైల్వేస్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమై రైల్వేస్టేషన్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశాయి.
మరోవైపు.. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో హింసాత్మక ప్రదర్శనలు జరుగుతున్నాయి. యువత ప్రారంభించిన నిరసనలో రాజకీయ పార్టీలు కూడా చేరాయి. కాగా, సోమవారం కొన్ని సంస్థల తరపున భారత్ బంద్ కొనసాగుతోంది. భారత్ బంద్ నేపథ్యంలో పలు చోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీసులు (GRP) హైఅలర్ట్‌లో ఉన్నారు. అల్లర్లు సృష్టించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని యువకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునేది లేదని సైన్యం స్పష్టం చేసింది.
ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. నేడు 2 వేల మందికిపైగా పోలీసులు నగరంలో పహారా కాస్తారని అధికారులు తెలిపారు. అంతేకాదు, బంద్ సందర్భంగా హింసకు పాల్పడే వారిని గుర్తించేందుకు వీడియోలు కూడా తీయనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఝార్ఖండ్‌లో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి