ఇంటి అద్దె చెల్లించకపోతే ఏ ఓనర్ అయినా ఏం చేస్తాడు.. సామాన్లు బయట విసిరేసి ఇళ్లు ఖాళీ చేయిస్తాడు. లేదంటే ఇంట్లో ఖరీదైన వస్తువుగానీ, వాహనాన్నిగానీ పట్టుకుపోతాడు. అదే ఇంటి డాబాపై ఉన్న మొబైల్ టవర్ రెంట్ కట్టకపోతే..? ఎవ్వరూ ఊహించని బిగ్ ట్విస్ట్ ఇచ్చాడీ ఇంటి యజమాని. టవర్‌ను పార్టులు పార్టులుగా ఊడదీసి పాతసామాన్ల వాడికి అమ్మి సొమ్ముచేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే..
జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ చెన్నైలోని కోయంబేడులోని నార్త్ మాడా స్ట్రీట్‌లో ఓ ఇంటి టెర్రస్‌పై 15 అడుగుల ఎత్తైన మొబైల్ టవర్‌ను 2006లో ఏర్పాటు చేసింది (ఈ మధ్యకాలంలో బిల్డింగ్‌లపై మొబైల్ టవర్లు అన్ని చోట్లా కనిపిస్తున్నాయి). అప్పటి నుంచి సదరు టెలికాం కంపెనీ యజమానులైన చంద్రన్, కరుణాకరన్, బాలకృష్ణన్ 2018 వరకు సక్రమంగా అద్దె చెల్లించింది. ఆ తర్వాత రెంట్ పే చేయ్యలేదు. మార్చి 12, 2018 నుంచి కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్‌లో ఉండటంతో అద్దె బకాయిలు చెల్లించకుండా వాయిదా వేస్తూ వచ్చింది. ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన కొందరు ఉద్యోగులు భవనాన్ని సందర్శించి మొబైల్ టవర్ కనిపించకపోవడాన్ని గుర్తించారు. ఇంటి యజమానిని ఆరా తీయగా ఆసలు విషయం విని ఖంగు తిన్నారు.
ఐదేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో టవర్‌ను కూల్చి కోయంబేడులోని స్క్రాప్ షాపులో విక్రయించినట్లు యజమాని తెలిపాడు. దీంతో తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్రమంగా టవర్‌ను కూల్చివేసి విక్రయించిన భవన యజమానిపై జీటీఎస్ అధికారులు కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టవర్ విలువ రూ.8.62 లక్షలు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.