Gold Rings: పార్టీలో సభ్యులను చేర్చితే బంగారు ఉంగరాలు బహుమతి.. ఆ పార్టీ నేత ఆసక్తికర ప్రకటన

రాష్ట్రంలో పార్టీ క్యాడర్ బేస్‌ను పెంచుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ వినూత్న ప్రకటన చేసింది. పార్టీ సభ్యత్వ నమోదులో ఎక్కువ మందిని సభ్యులుగా చేర్చే వారికి బంగారు ఉంగరాలు, కాయిన్స్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Gold Rings: పార్టీలో సభ్యులను చేర్చితే బంగారు ఉంగరాలు బహుమతి.. ఆ పార్టీ నేత ఆసక్తికర ప్రకటన
Representative Image
Follow us

|

Updated on: Sep 27, 2021 | 6:58 PM

రాష్ట్రంలో పార్టీ క్యాడర్ బేస్‌ను పెంచుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ వినూత్న ప్రకటన చేసింది. పార్టీ సభ్యత్వ నమోదులో ఎక్కువ మందిని సభ్యులుగా చేర్చే వారికి బంగారు ఉంగరాలు, కాయిన్స్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు దక్షిణ చెన్నై డీసీసీ అధ్యక్షుడు ఎంఏ ముత్తలగన్ చేసిన ప్రకటన తమిళనాడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టిన ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. ఇందులో భాగంగా ఓ వినూత్న ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ‘ప్రతి వీధిలో కాంగ్రెస్.. ప్రతి ఇంట్లో కాంగ్రెస్’ అంటూ ఆదివారంనాడు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దక్షిణ చెన్నై డీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేత రాహుల్ గాంధీని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించాలంటూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన డీసీసీ అధ్యక్షుడు..జిల్లా పరిధిలో అత్యధిక సంఖ్యలో పార్టీ సభ్యులను చేర్చేవారికి 8 గ్రాముల బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే రెండో స్థానంలో నిలిచే వ్యక్తికి 4 గ్రాముల బంగార ఉంగరాన్ని బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వీరితో పాటుగా సభ్యత్వ నమోదులో చురుకైన పాత్ర పోషించి.. ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాన్ని నమోదుచేసే పార్టీ నేతలకు బంగారు కాయిన్స్ బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి, ఏఐసీసీ కార్యదర్శి సిరివెళ్ల ప్రసాద్ సమక్షంలోనే డీసీసీ ఈ ఆసక్తికర ప్రకటన చేయడం విశేషం.

పార్టీలో సభ్యులను పెంచుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తీవ్రంగా శ్రమించడం తెలిసిందే. అయితే సభ్యత్వ నమోదు కోసం ఈ రకంగా బంగారు ఉంగరాలు, కాయిన్స్ బహుమతిగా ప్రకటించడం వింతగా ఉందంటూ రాజకీయ ప్రత్యర్థులు వాపోతున్నారు. అయితే ఈ  బహుమతులు డీసీసీ అధ్యక్షుడు వ్యక్తిగతంగా ఇచ్చేవే తప్ప.. పార్టీకి సంబంధంలేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నేతలు చెబుతున్నారు. పార్టీలో సభ్యత్వ నమోదులో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించేందుకే ఈ రకమైన ప్రకటన చేశారని అంటున్నారు.

Also Read..

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విడుదలవుతున్న ‘మార్క్యూ ఎం3 స్మార్ట్’ ఫోన్.. ధర చాలా తక్కువ.. అద్భుత ఫీచర్స్‌..

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ సరికొత్త ప్లాన్.. ఎన్నికలకు రెండేళ్ల ముందే కీలక ప్రకటన..