
దేశరాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘటనలు పక్కా ప్లాన్ ప్రకారం చేసిన దాడి అంటూ సంచలన వ్యాక్యలు చేశారు. అంతేకాదు.. దీనిపై తమ వద్ద సమాచారం కూడా ఉందన్నారు.
ఢిల్లీకి సంబంధించిన శాంతి భద్రతల వ్యవహారం.. కేంద్రం పరిధిలో ఉందని గుర్తుచేశారు. వేల సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించినా అల్లర్లు ఏ మాత్రం నియంత్రించలేకపోయారన్నరని ఆరోపించారు. ఈ దారుణ ఘటనపై బీజేపీ ఇప్పటి వరకు క్షమాపణ చెప్పకపోవడం సిగ్గుచేటన్నారు. కోల్‌కతాలో సోమవారం టీఎంసీ నిర్వహించిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఆదివారం కోల్‌కతాలో అమిత్ షా సభలో.. గోలీ మార్ నినాదాలపై స్పందించారు. ఇది ఢిల్లీ కాదని.. బంగాల్‌లో ‘గోలీ మారో’ వంటి నినాదాలు చెల్లవని హెచ్చరించారు. అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఢిల్లీ అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలకు.. విరాళాలు సేకరించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దీదీ పిలుపునిచ్చారు.
మరోవైపు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో ఆదివారం “గోలీమారో” అంటూ నినాదాలు చేసిన ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు.