
తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వేదికగా గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. ఇటీవల కోర్టు తీర్పు వచ్చాక సమస్య తీరుతుంది అనుకుంటే దశాబ్దాలుగా ఉన్న వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటిదాకా మతపరమైన అంశంగా ఉన్న వివాదానికి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో హిందూ, ముస్లీం సంఘాలు వరుస ఆందోళనలకు దిగుతున్న పరిస్థితి నెలకొంది. తమిళనాడులో సుబ్రమణ్య స్వామి ఆలయాలకు ప్రాముఖ్యత ఉంది. తిరుత్తణి, పళనీ, తిరుచెందూర్ అలాగే తిరుప్పరంకుండ్రం సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఎంతో ప్రసిద్ధి. కుమార సంభవం అనే మహా కావ్యంలోనూ తిరుప్పరగుండ్రం ఆలయ ప్రస్తావన ఉంది
సుబ్రహ్మణ్యస్వామి ప్రధాన దేవాలయం వెనుక ఒక గుట్ట పైన వినాయకుడి దేవాలయం ఉంది. అన్ని ఉత్సవాలకు ఈ గుడి ప్రాంగణంలోని దీపస్థంభం పైన కార్తికదీపం వెలిగించడం సంప్రదాయం. ఈ గుడికి కొద్ది దూరంలో ఉన్న గుట్టలలో ఎత్తైన ఇంకొక గుట్టపై సికందర్ షా దర్గా ఉంది. ఈ దర్గా ఆవరణ నుంచి దాదాపు 50 మీటర్ల దూరంలో ఆ దీపస్తంభం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు దీనిపైన కూడా కార్తీకదీపం వెలిగించేవారు. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో ఇది నిలిపివేసినట్లు స్థానికులు చెబుతారు. మదురై 1335 నుండి 1377 వరకు సుల్తానుల పాలనలో ఉండేది. 1377లో విజయనగర సైన్యం కుమార కంపన్న నాయకత్వంలో అప్పటి సుల్తాన్ సికందర్ షాను ఓడించి మదురైను కైవసం చేసుకొంది. అతడి జ్ఞాపకార్థం తిరుప్పరంకుండ్రంలో ఈ స్మారకచిహ్నాన్ని నిర్మించారని అంటారు. ఇది 14-15వ శతాబ్దంలో జరిగి ఉండవచ్చు.18వ శతాబ్దంలో దీనిని విస్తరించి సికందర్ దర్గా అని వ్యవహరించడం జరిగేది.
ఇటీవల మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఈ వ్యవహారంపై కీలక తీర్పునిచ్చింది. కొండపై దీపారాధన చేసుకోవచ్చని ఆదేశాలిస్తూ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. తీర్పును ముస్లిం సంఘాల నేతలు వ్యతిరేకించారు. అయితే డీఎంకే కోర్టు తీర్పును తప్పుబట్టింది. భక్తుడి ఆలోచనలా ఉంది తప్ప న్యాయస్థానం ఇచ్చిన తీర్పులా లేదని అభిప్రాయపడింది. అలాగే బీజేపీ మాత్రం తీర్పును స్వాగతిస్తూ దీపోత్సవానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడాన్ని తప్పుబట్టింది. ఇక టీవీకే చీఫ్ విజయ్ ఈ అంశంపై నోరు విప్పి తన అభిప్రాయాన్ని చెప్పాలని కూడా డిమాండ్ చేసింది. నిన్న ముస్లిం సంఘాలు దర్గాలో వచ్చే నెలలో జరగనున్న పర్వదినానికి ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఈ సమయంలోనే ఆలయం వద్దకు చేరుకున్న హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి.. కొండపై దీపోత్సవానికి అనుమతించాలని డిమాండ్ చేశాయి. హిందూ సంఘాల నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రికత నెలకొంది.. ఇరువర్గాల మధ్య దశాబ్దాలుగా ఉన్న ఈ వివాదానికి పరిష్కారం దొరకక పోగా రాజకీయ పార్టీల మధ్య కొత్త చిచ్చు రాజేస్తోంది. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్ నేపథ్యంలో ఇది మరింత సున్నితమై అంశంగా మారే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..