PM Modi: ముప్పు పొంచి ఉంది.. గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ఆందోళన

ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, ఇంధన భద్రత, సాంకేతిక విభజన, ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి గ్లోబల్ సౌత్ దేశాలు ఏకం కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

PM Modi: ముప్పు పొంచి ఉంది.. గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ఆందోళన
Pm Modi In Global South Summit
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 17, 2024 | 1:53 PM

ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, ఇంధన భద్రత, సాంకేతిక విభజన, ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి గ్లోబల్ సౌత్ దేశాలు ఏకం కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం(ఆగస్ట్ 17) జరిగిన గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో వర్చువల్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం నెలకొని ఉందన్నారు. అటువంటి పరిస్థితిలో, గ్లోబల్ సౌత్ దేశాలు ఈ ప్రాథమిక సమస్యలపై తీవ్రంగా దృష్టి పెట్టాలన్నారు ప్రధాని మోదీ.

మూడవ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ప్రారంభ సెషన్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. అయా దేశాల మధ్య పరస్పర వాణిజ్యం, సమ్మిళిత వృద్ధి అవసరమన్నారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను, సామర్థ్యం మేరకు ముందుకు తీసుకెళ్లడానికి గ్లోబల్ సౌత్‌తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామన్నారు ప్రధాని. సోషల్ ఇంపాక్ట్ ఫండ్‌కు భారతదేశం 25 మిలియన్ డాలర్ల తొలి విరాళాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు.

” గ్లోబల్‌ సౌత్‌లోని దేశాలు ఐక్యంగా ఉండాలని, ముఖ్యమైన సమస్యలపై ఏకతాటిపై నిలవాల్సిన అవసరం నేటి కాలానికి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ దేశాలు పరస్పరం శక్తిగా మారాలి. ఒకరి అనుభవాల నుండి మరొకరు నేర్చుకుందాం. మన సామర్థ్యాలను పంచుకుందాం. ఇండియా స్టాక్ లేదా డిజిటల్ ఐడీ, చెల్లింపులు వంటి వాటిని పంచుకునేందుకు గ్లోబల్ సౌత్‌కు చెందిన 12 మంది భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు” ప్రధాని మోదీ తెలిపారు.

ఈ సమయంలో, ఉగ్రవాదం, తీవ్రవాదం మరియు వేర్పాటువాద సవాళ్లను కూడా ప్రధాని వివరంగా ప్రస్తావించారు. అవన్నీ మనకు ముప్పుగా మిగిలిపోతున్నాయని అన్నారు. ఐక్యత ద్వారానే వీటిని ఎదుర్కోగలమన్న ఆయన, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సు వేదికగా మారిందన్నారు. జీ20కి భారత నాయకత్వంలో, గ్లోబల్ సౌత్ అంచనాలు, ఆకాంక్షలు, ప్రాధాన్యతల ఆధారంగా ఒక ఎజెండాను రూపొందించామని ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధి-ఆధారిత దృక్పథం నుండి భారతదేశం జీ20ని ముందుకు తీసుకువెళ్లింది. గ్లోబల్ సౌత్ బలం దాని ఐక్యతలో ఉంది. ఈ ఐక్యత, బలంతో కొత్త దిశలో పయనిస్తామని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు.

కోవిడ్-19 ప్రభావం నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా బయటపడలేదని ప్రధాని మోదీ గుర్తు చేశారు. మరోవైపు, యుద్ధాలు మన అభివృద్ధి ప్రయాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. సవాళ్లను సృష్టించాయి. అలాగే వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడమే కాకుండా ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, ఇంధన భద్రతపై కూడా ఆందోళన చెందుతున్నామని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..