Kerala Floods: భారీ వర్షాలతో కకావికలమవుతున్న కేరళ.. పినరయ్ విజయన్‎తో ఫోన్‎లో మాట్లాడిన ప్రధాని మోడీ..

|

Oct 17, 2021 | 6:13 PM

కుండపోత వానలతో కకావికలమవుతోంది కేరళ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అల్లాడిపోతోంది. పట్టణాలు, నగరాలు చెరువుల్లా మారాయి. నదులు మహోగ్రరూపం దాల్చాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి...

Kerala Floods: భారీ వర్షాలతో కకావికలమవుతున్న కేరళ.. పినరయ్ విజయన్‎తో ఫోన్‎లో మాట్లాడిన ప్రధాని మోడీ..
Modi
Follow us on

కుండపోత వానలతో కకావికలమవుతోంది కేరళ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అల్లాడిపోతోంది. పట్టణాలు, నగరాలు చెరువుల్లా మారాయి. నదులు మహోగ్రరూపం దాల్చాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాల ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 15కు చేరింది. మల్లపురం, కోజికోడ్, వయనాడ్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొండచరియలు విరిగిపడి 26 మంది గల్లంతయ్యారు. ఇడుక్కిలో నిన్న సాయంత్రం 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిజోరు వానకు ఉప్పొంగిన వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. వరద ప్రవాహానికి 15మంది గల్లంతయ్యారు.

మరోవైపు ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషిచేస్తోంది. ఎన్‎​డీఆర్‎​ఎఫ్​ బృందాలు రంగంలోకి దిగి అనేక ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. వరదలు, కొండచరియలు విరిగి పడిన ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్​ను చేపట్టి గల్లంతైన వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాలినడకన చేరలేని ప్రదేశాలకు వాయుమార్గం ద్వారా వెళ్లి ఆహార పొట్లాలు, నిత్యవసర సామగ్రిని అందిస్తున్నాయి. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. చిన్నపిల్లలు, మహిళలు, ముసలివారిని రక్షించి పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తీసుకెళుతున్న దృశ్యాలు టీవీలు, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. 6 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది పథనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్‌, పాలక్కడ్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. తాజా పరిస్థితులు 2018, 2019 వరదలను తలపిస్తున్నాయని స్థానిక అధికారులు చెబుతున్నారు.

కేరళ వరదలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కేరళలోని తాజా పరిస్థితులపై చర్చినట్లు మోడీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. “కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‎​తో మాట్లాడాను. అక్కడి పరిస్థితులపై చర్చించాను. క్షతగాత్రులు, బాధితులకు అండగా నిలిచేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చేస్తున్నారు. కేరళవాసులు సురక్షితంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నా.” అని మోడీ ట్వీట్ చేశారు.

 

Read Also.. Kerala rainfall, floods: కేరళలో వర్ష బీభత్సం, 18 మంది మృతి.. 22మంది గల్లంతు. శబరిమల దర్శనం రద్దు