టెక్నాలజీ కంపెనీల్లో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి కారణాలను సాకుగా చూపుతూ ఐటీ కంపెనీలు వేలమంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా.. విప్రో టెక్నాలజీస్ కూడా అదే బాట పట్టింది. అయితే, విప్రో కాస్త ఆలోచించి, ఉద్యోగులను తొలగించకుండా వారి వేతనంలో కోత విధించింది. 2022-23 వెలాసిటీ పట్టభద్రుల విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి తొలుత 6.5 లక్షల వేతన ప్యాకేజీని విప్రో ఆఫర్ చేసింది. అయితే గతంలో ప్రకటించినట్టు కాకుండా ఆ ప్యాకేజీని తగ్గించింది. మూడున్నర లక్షల ప్యాకేజీ మాత్రమే ఇస్తామంటూ వారికి ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు తగినట్టుగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నట్టు ఆ మెయిల్‌లో విప్రో పేర్కొంది.
అంతే కాకుండా ఈ ఆఫర్‌కు అంగీకరించి వెంటనే విధుల్లో చేరాలని కోరింది. దీనికి ఓకే అంటే గత ఆఫర్ రద్దవుతుందని వెల్లడించింది. శిక్షణ సమయంలోనే పనితీరు సరిగా లేదంటూ 425 మందిని ఇటీవల విప్రో తొలగించింది. ఇప్పుడు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వేతన కోతతో షాకిచ్చింది. కాగా.. ధుల్లోకి వచ్చే ఫ్రెషర్స్ సగం జీతానికే పనిచేయాలనే టెక్ దిగ్గజం విప్రో నిర్ణయాన్ని ఐటీ సంఘం తప్పుబట్టింది. ఇది అన్యాయమని, ఆమోదించదగ్గ చర్య కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
జీతాలను సగానికి తగ్గించుకోవాలనడం సరైంది కాదు. ఆర్థిక కష్టాన్ని ఉద్యోగులపై మోపడం అనైతికం. సంస్థ, ఉద్యోగులతో యూనియన్ చర్చలు నిర్వహించాలి. ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు, టెక్ కంపెనీల్లో నెలకొన్న సవాళ్లను ప్రతిబింబించేలా విప్రో నిర్ణయం ఉంది.
– హర్‌పీత్ సింగ్, మనీ నైట్స్ అధ్యక్షుడు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.