Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాంలో నాన్ లోకల్ లేబర్‌పై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వలస కూలీలపై ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. కూలీల ఇళ్లల్లోకి చొరబడి మరీ కాల్పులకు దిగుతున్నారు ఉగ్రమూకలు. ఉగ్రవాదుల కాల్పోల్లో మృతి చెందిన వారు బీహార్‌కు చెందిన రాజా దేషిదేవ్, జోగిందర్ రేషి దేవ్‌గా గుర్తించారు పోలీసులు. కూలీలు, ఉద్యోగులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించాలని సూచించారు. అయితే రెండు రోజుల వ్యవధిలో ఐదుగురు కూలీలను పొట్టనబెట్టుకున్నారు ఉగ్రవాదులు. అతిదారుణంగా కాల్చి చంపారు.
ఇక గాయపడ్డ మరో వ్యక్తిని చున్ చున్ రేషి దేవ్‌గా గుర్తించారు. సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా.. గడిచిన రెండు రోజుల్లో ఉగ్రవాదులు కాల్పులకు దిగడం ఇది మూడోసారి.
ఇలా ఉగ్రవాదుల ఘాతుకానికి అమాయక ప్రజలు బలవుతున్నారు. రోజువారీగా పనులు చేసుకుంటూ పొట్టనింపుకొనే కూలీలు సైతం ఉగ్రవాదుల తూటాలకు బలవుతున్నారు. ఉగ్రవాదులని ఏరివేసేందుకు జమ్మూలో ప్రతి రోజు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఉగ్రవాదులను హతమారుస్తుండగా, ఇంకా ఉగ్రవాదులు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రత్యేక బలగాలు అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి.