Telangana BJP Leaders meet Amit Shah: గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ సర్కార్ ల మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు అంశంపై రెండు ప్రభుత్వాల మధ్య రాజకీయ యుద్దమే కొనసాగుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో ఒకరిపై మరొకరు నిందించుకుంటున్నారు. ఈ తరుణంలోనే.. ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలు, రాష్ట్ర నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా నేతలను ఉద్ధేశించి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్‌పై ప్రత్యక్ష రాజకీయ సమరానికి సిద్ధం కావాలని సూచించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర పర్యటనకు తాను రానున్నట్లు ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అయితే, ఆయన డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదని తెలుస్తోంది.
.
ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని.. కేసీఆర్ ట్రాప్ లో పడకండంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అవినీతికి సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. హుజురాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లో గెలవాలని నాయకులకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయండి.. ప్రభుత్వపరంగా ఏమి చేయాలో తమకు వదిలేయాలని ఆయన పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలో తరచూ పర్యటిస్తానని నాయకులకు అమిత్‌షా హామీ ఇచ్చారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రులు, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి , విజయశాంతి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌తో సహా పలువురు ముఖ్య నేతలంతా అమిత్‌షాతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని అమిత్‌షా ఛాంబర్‌లో జరిగిన ఈ భేటీకి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా హాజరయ్యారు.