బెంగాల్ పాలిటిక్స్ః దీదీకి ఆర్జేడీ సంపూర్ణ మద్దతు.. లెఫ్ట్-కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన సీట్ల సర్ధుబాటు
తన రాజకీయ జీవితంలో చాలా టఫ్ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ ప్రభంజనాన్ని ఆపడానికి దీదీ అన్ని ఎత్తులు ప్రయోగిస్తున్నారు.
West Bengal Election 2021 : పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బీజేపీని అధికారం లోకి రాకుండా చూడడమే మా లక్ష్యం.. అంటూ మమతకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి ఇతర పార్టీలు. అసెంబ్లీ ఎన్నికల పొత్తుపై దీదీతో ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ చర్చలు జరిపారు.
ఇదిలావుంటే, తన రాజకీయ జీవితంలో చాలా టఫ్ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ ప్రభంజనాన్ని ఆపడానికి దీదీ అన్ని ఎత్తులు ప్రయోగిస్తున్నారు. తాజాగా ఇతర పార్టీల మద్దతును కూడా కోరుతున్నారు మమత. బీహార్‌లో సత్తా చాటిన ఆర్జేడీ యువనేత తేజస్వియాదవ్ మమతకు సంపూర్ణమద్దతు ప్రకటించారు.
మరోవైపు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం ఎట్టకేలకు ముగిసింది. 294 స్థానాలున్న బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి 92 స్థానాలు వచ్చినట్టు.. కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదురి సోమవారం ప్రకటించారు. మిగిలిన 202 స్థానాల్లో వామపక్ష పార్టీలన్నీ పోటీ చేయనున్నాయి. సీట్ల పంపకాలపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి.
ఈ విషయమై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదురి మాట్లాడుతూ ‘‘వామపక్ష పార్టీలతో చర్చలో కుదిరిన ఒప్పందం ప్రకారం.. రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 92 స్థానాల్లో పోటీ చేయబోతోంది. ఈ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను రెండు రోజుల్లో విడుదల చేస్తామన్నారు.
ఇక, 2016 ఎన్నికలతో పోల్చితే, ఈసారి ఎన్నికలకు వామపక్ష, కాంగ్రెస్ పార్టీల సీట్ల పంపకాల్లో ఎలాంటి తేడా లేదు. 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 92 స్థానాల్లోనే పోటీ చేసింది. అయితే, వామపక్ష పార్టీల కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. 202 స్థానాల్లో పోటీ చేసిన వామపక్షాలు కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. కానీ, కాంగ్రెస్ పార్టీ 44 స్థానాల్లో గెలుపొంది బెంగాల్‌లో ప్రతిపక్షంగా అవతరించింది. తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తమకు గతంలో కంటే ఎక్కువ స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఈ విషయమై వామపక్ష పార్టీలు కాంగ్రెస్ మధ్య అనేక చర్చలు జరిగాయి. అయితే ఎట్టకేలకు పాత ఒప్పందానికి కాంగ్రెస్ ఒప్పుకుంది. మళ్లీ 92 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. ఇక ఈ కూటమిలో పెద్ద వాటాదారుగా సీపీఎం ఉంది. గతంలో 148 స్థానాల్లో పోటీ చేసిన సీపీఎం.. కేవలం 26 స్థానాలు మాత్రమే గెలిచి మూడో స్థానానికి పరిమతమైంది. అయితే 2016 ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్న వామపక్ష-కాంగ్రెస్ కూటమికి.. ఈసారి ఎన్నికల్లో అంత ప్రాధాన్యత లేదనే చెప్పాలి. టీఎంసీకి పోటీగా ప్రధాన పోటీగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో 18 ఎంపీ స్థానాలు గెలిచి అసెంబ్లీ పోరులో మమతా బెనర్జీకి సవాల్ విసురుతోంది.
Read Also… నాకు వ్యాక్సిన్ వద్దు.. ముందు యువతకు ఇవ్వండి.. కోవిడ్ టీకాపై మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..!